తూచ్‌.. మళ్లీ మొదటికి

24 Apr, 2017 00:42 IST|Sakshi
తూచ్‌.. మళ్లీ మొదటికి

⇒ ఫుట్‌ ఓవర్‌ వంతెనల నిర్మాణానికి బ్రేక్‌!
⇒ పాదచారుల కల నేర వేరేనా..?
⇒ యాడ్స్‌ స్థలం మార్పు యోచన

సిటీబ్యూరో: మహానగరంలో రద్దీ గల ప్రధాన రహదారులపై తలపెట్టిన పాదచారుల వంతెనల నిర్మాణాలకు ఆదిలోనే బ్రేక్‌ పడింది. ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీతో రోడ్డు దాటేందుకు పాదచారుల ఇబ్బందులను నివారించేందుకు పైసా ఖర్చు లేకుండా బీవోటీ పద్ధతిలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మానం చేపట్టాలని గతేడాది జీహెచ్‌ఎంసీ పాలకవర్గం నిర్ణయించింది. ప్రయివేటు యాడ్‌ ఏజెన్సీలకు వంతెన నిర్మాణాల బాధ్యత అప్పగించి.. వారికి వాటి పై భాగంలో ప్రకటనలు పెట్టుకొనేందుకు అనుమతించి తిరిగి డబ్బులు రాబట్టుకునే వెసులుబాటు కల్పించాలని భావించింది. అతి తక్కువ కాలం కోడ్‌ చేసే ఏజెన్సీలకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది.

పాదచారుల వంతెనల నిర్మాణం కోసం సర్వే, స్థలాల గుర్తింపు, వంతెనల డిజైన్, టెండర్‌ నిబంధనల రూపకల్పన బాధ్యతను ఐఐడీసీ అనే ప్రయివేటు సంస్థకు అప్పగించింది. దీంతో సదరు సంస్ధ నగరంలో ప్రధాన రహదారులపై సర్వే నిర్వహించి పలు ప్రదేశాలను గుర్తించింది. వంతెనల డిజైన్‌తో పాటు టెండర్‌ నిబంధలను రూపొందించి జీహెచ్‌ఎంసీకి అందించింది. ఇందుకు కోసం జీహెచ్‌ఎంసీ రూ.2 కోట్లు ఖర్చు చేసింది.

55 ప్రాంతాల్లో వంతెనలు..
నగరంలోని ప్రధాన రహదారుల్లోని 55 ప్రాంతాల్లో పాదచారుల వంతెనలు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గతేడాది నవంబర్‌లో వంతెన నిర్మాణాల కోసం జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం టెండర్లను ఆహ్వానించింది. స్పందించిన ప్రయివేటు యాడ్‌ ఏజెన్సీలు టెండర్లను వేశాయి. నాలుగు నెలల తర్వాత టెండర్లను ఓపెన్‌ చేసిన అధికారులు తక్కువగా  కాలాన్ని కోడ్‌ చేసిన యాడ్‌ ఏజెన్సీలకు టెండర్లను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు మాత్రం అప్పగించలేదు.

ప్రకటనల స్థలం మార్పు యోచన..
 పాదచారులు వంతెనలపై ప్రకటనల స్థలం మార్పు చేయాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. వంతెనపై యాడ్స్‌ పెట్టుకునే స్థలంపై సంబంధిత శాఖ మంత్రి జీహెచ్‌ఎంసీకి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈమేరకు టెండరు దక్కించుకున్న యాడ్‌ ఏజెన్సీలతో చర్చలు ప్రారంభించింది. ఇటీవల సమావేశం నిర్వహించి టెండర్‌లో పేర్కొన్న ప్రకటన స్థలాన్ని మార్పు చేసుకోగలరా? అని  సంబంధిత అధికారులు అడగడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

యాడ్‌ ఏజెన్సీలు మాత్రం అందుకు ససేమిరా అనట్లు తెలుస్తోంది. సుమారు రెండు కోట్ల వెచ్చించి ప్రయివేటు సంస్థ ద్వారా  టెండర్‌ నిబంధనలు రూపొందించిన జీహెచ్‌ఎంసీ తిరిగి అందులో చేర్పులు మార్పులుకు ప్రయత్నించడం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా టెండర్‌ దక్కించుకున్న యాడ్‌ ఏజెన్సీలకు పనులు అప్పగించాలా..? లేక తిరిగి కొత్త నిబంధలతో టెండర్‌ ఆహ్వానించాలా అని జీహెచ్‌ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు