మా ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవద్దు

20 Feb, 2016 09:38 IST|Sakshi

టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
పార్టీ అవసరాల దృష్ట్యా తప్పదన్న లోకేష్
నేడు చంద్రబాబుతో కేఈ, శిల్పా సోదరుల భేటీ


 సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని తమ రాజకీయ ప్రత్యర్ధులను టీడీపీలో చేర్చుకోవద్దని జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా నుంచి ప్రతిపక్ష పార్టీ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో వీరిద్దరూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తమకు, పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్నవారికి ఎంతోకాలంగా రాజకీయంగా వైరం ఉందని వివరించారు.

పార్టీ అవసరాలు, రాజకీయ భవిష్యత్   దృష్ట్యా కొందరిని పార్టీలో చేర్చుకోక తప్పదని, ఎవరు పార్టీలో చేరినా అభ్యంతర పెట్టవద్దని, ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుందని లోకేష్ చెప్పినట్లు సమాచారం. జిల్లాలో రానున్న మూడు సంవత్సరాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా పోటీచేసే అవకాశం మీకే ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. శిల్పా సోదరులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కె. అచ్చాన్నాయుడు కూడా మాట్లాడారు. పార్టీ కోసం అధినేత తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని సూచించారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీలో కొందరు చేరే అంశంపై ఆ జిల్లా నేతలతో శనివారం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి,  శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి తదితరులు శనివారం విజయవాడ వెళ్లనున్నారు.

>
మరిన్ని వార్తలు