లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..

21 Oct, 2016 12:22 IST|Sakshi
లోకేష్ ఏపీ పాలిటిక్స్ చూసుకుంటే మంచిది..

హైదరాబాద్ :  టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్పై టీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ‍్రస్థాయిలో మండిపడ్డారు. ఆస్తుల వివరాల వెల్లడి విషయంలో తమకు ఎవరి సలహాలు అవసరం లేదని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని, తాము ఎవరికి లెక్కలు చూపించాలో వారికే లెక్కలు చూపిస్తామని కవిత వ్యాఖ్యానించారు. అన్నా హజారేలమని చెప్పుకొని ఆస్తులు ప్రకటించుకోవటం హాస్యాస్పదమన్నారు. మాసం తిని బొక్కలు మెడలో వేసుకుని వాళ్లం కాదని కవిత ఎద్దేవా చేశారు.

ఆమె శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ది ప్రెస్లో మాట్లాడారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుటుందని... ఏపీ పాలన గురించి తాము మాట్లాడితే బాగుండదని కవిత సూచించారు. మహిళలు మంత్రివర్గంలో ఉన్నా, లేకపోయినా వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు.

గత రెండేళ్లుగా తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మకు విశేష ఆదరణ లభించిందన్నారు. అక్కడి ప్రభుత్వాలు కూడా బతుకమ్మ పండుగను గుర్తించాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే కవులు, కళాకారులను గౌరవించుకోగలిగామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు బహుభాషా కోవిదుడు అయినప్పటికీ...ఆయనకు సొంతగడ్డపై  రావాల్సినంత కీర్తిప్రతిష్టలు రాలేదన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక కృషి చేశారని కవిత అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు ప్రజలన గందరగోళానికి గురి చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. రాజకీయాలను నీచస్థాయికి దిగజార్జిన ఘనత కాంగ్రెస్  పార్టీదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. తమ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు, తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నమని కవిత అన్నారు.

మరిన్ని వార్తలు