3,500 మందితో గులాబీ దండు!

21 Jun, 2017 03:22 IST|Sakshi
3,500 మందితో గులాబీ దండు!

సార్వత్రిక ఎన్నికల కోసం అధికార పార్టీ వ్యూహం
- ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను జనంలోకి తీసుకెళ్లేలా శిక్షణ
- త్వరలో పార్టీ నియోజకవర్గ కమిటీలు.. ఒక్కోదానిలో 22 మంది!
- ఇతర సంస్థాగత కమిటీల నియామకం కూడా..


సాక్షి, హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల గడువే ఉండడంతో అధికార టీఆర్‌ఎస్‌ రాజకీయ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదే సమయంలో నియోజక వర్గాల్లో రాజకీయ పరిస్థితిని అధ్యయనం చేయడం కోసం పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయికి పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా కనీసం 3,500 మంది నేతలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.

సమయం దగ్గరపడుతుండడంతో..
రెండేళ్ల కింద నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వివిధ అంశాల్లో నిపుణులతో తరగతులు నిర్వహించారు. రాజకీయ అంశా లపై స్వయంగా సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం శిక్షణ ఉంటుందని ప్రకటిం చినా కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఎన్నిక లు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లా ల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్‌.. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

సంస్థాగత నియామకాల తర్వాత..
టీఆర్‌ఎస్‌ మూడేళ్లుగా ప్రధాన కమిటీలు లేకుండానే కొనసాగుతోంది. గ్రామ, మండల కమిటీలు మినహా ఏ కమిటీలూ లేవు. అయితే రెండు నెలల కింద 16వ ప్లీనరీ సమయంలో అన్ని పార్టీ కమిటీలను భర్తీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిపై ఇరవై రోజులుగా ఆయన కసరత్తు చేపట్టారని తెలుస్తోంది. మరోవైపు తొలిసారిగా టీఆర్‌ఎస్‌లో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయను న్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల సారథ్యంలో కమిటీలు ఉంటాయి. స్థానిక ఎంపీ సభ్యుడిగా ఉంటారు.

ఇక కమిటీల్లో ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మరో 20 మందిని నియమించనున్నారని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం పరిధిలో సగటున ఐదు మండలాలు ఉంటాయనుకుంటే.. ఒక్కో మండలం నుంచి కనీసం నలుగురికి సభ్యులుగా అవకాశం దక్కనుంది. ఇక నియోజకవర్గ కమిటీలతోపాటు రాష్ట్ర కమిటీ, పోలిట్‌ బ్యూరోలను కూడా ఈ నెలాఖరుకు నియమించే అవకాశముందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కమిటీల నియామకం పూర్తయ్యాక అన్ని కమిటీలతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారితో కలిపి మొత్తంగా 3,500 మందికి రెండు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రతిపక్షం బలాబలాలపై ఆరా
ఒకసారి శిక్షణ పూర్తయితే నాయకులు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి కూడా వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తారన్న ఆలోచనలో పార్టీ ఉంది. దాంతోపాటు కమిటీల ద్వారా నియోజకవర్గాల్లో తమ పార్టీ, ఎమ్మెల్యేల పరిస్థితి, బలహీనతలపై సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల పరిస్థితి, బలాబలాలను అంచనా వేయడం కూడా సాధ్యమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు