ఇద్దరు హెచ్‌సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు

14 Jun, 2016 02:13 IST|Sakshi
ఇద్దరు హెచ్‌సీయూ ప్రొఫెసర్లపై సస్పెన్షన్ వేటు

పోలీసు కస్టడీలో ఉన్నందుకే ఈ చర్యలన్న యాజమాన్యం

 

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాజమాన్యం దళిత ప్రొఫెసర్లు కె.వై.రత్నం, తథాగత్‌లను సస్పెండ్ చేసింది. రోహిత్ ఆత్మహత్యానంతరం హెచ్‌సీయూలో విద్యార్థి ఉద్యమానికి అండగా నిలి చిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కె.వై.రత్నం, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ తథాగత్‌లను సస్పెండ్ చేస్తూ వర్సిటీ యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2 రోజులకు పైగా పోలీసు కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కారణంగా వారిపై ఈ చర్యలు తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోహిత్ ఉదం తం నేపథ్యంలో సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు తిరిగి హఠాత్తుగా విధుల్లో చేరడాన్ని కొందరు విద్యార్థులు, ఆచార్యులు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా నాడు జరిగిన ఆందోళనలో మొత్తం 27 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 25 మంది విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు రత్నం, తథాగత్‌లు కూడా ఉన్నారు.

అన్యాయాన్ని ప్రశ్నించినందుకే...
వీసీ అప్పారావు నియంత పాలన సాగిస్తున్నారని, విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తమని అరెస్టులు చేయించి, పోలీసులతో కొట్టించి, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ప్రొఫెసర్లు రత్నం, తథాగత్‌లు ఆరోపించారు. అందులో భాగంగానే తమపై తాజా సస్పెన్షన్ వేటన్నారు. రోహిత్‌తో పాటు అంతకుముందు వర్సిటీలో జరిగిన ఆత్మహత్యలకు ఇక్కడ కొనసాగుతున్న కులవివక్షే కారణమన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు