ఎస్సై పోస్టులకు 2 లక్షల దరఖాస్తులు

12 Mar, 2016 00:29 IST|Sakshi
ఎస్సై పోస్టులకు 2 లక్షల దరఖాస్తులు

♦ ముగిసిన దరఖాస్తు గడువు, ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష
♦ జంబ్లింగ్ పద్ధతిలో హాల్‌టికెట్ నంబర్లు
♦ ఎస్సై కన్నా కానిస్టేబుల్ పోస్టులకే అభ్యర్థుల మొగ్గు
♦ కానిస్టేబుల్ కొలువులకు ఏకంగా 5.36 లక్షల దరఖాస్తులు
 
 సాక్షి, హైదరాబాద్: ఎస్సై పోస్టులకు దరఖాస్తుల గడువు ముగిసింది. వివిధ విభాగాలలోని 539 పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో పురుషులు 1.75 లక్షలు కాగా, మహిళలు 25 వేల మంది ఉన్నారు. వీరికి ఏప్రిల్ 17న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అభ్యర్థుల వేలిముద్రలు కూడా తీసుకోనున్నారు. అలాగే హాల్‌టికెట్లను వరుస క్రమంలో కాకుండా జంబ్లింగ్ విధానంలో ఇవ్వనున్నారు.

 ఎస్సై పోస్టులకు తగ్గిన ఉత్సాహం
 కానిస్టేబుల్ పోస్టులతో పోలిస్తే ఎస్సై పోస్టుల దరఖాస్తు విషయంలో అభ్యర్థులు అంతగా ఉత్సాహం కనబరచలేదు. కానిస్టేబుల్ పోస్టులకు వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఎస్సై పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. కానిస్టేబుల్ పోస్టులకు మహిళా అభ్యర్థులు 82 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఎస్సై పోస్టులకు 25 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా కానిస్టేబుల్ పోస్టులకు దాదాపు 5.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించిన వారు 2.08 లక్షల మంది ఉన్నారు. కానీ ఎస్సై పోస్టుల విషయానికొస్తే 2.01 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. కానిస్టేబుల్‌తో పోల్చితే ఎస్సై కొలువు కాస్త ఉన్నత ఉద్యోగమైనప్పటికీ దరఖాస్తులు ఆ స్థాయిలో రాలేదు. ఎస్సై పోస్టులకు దాదాపు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని భావించినా అలా జరగలేదు. అందులోనూ గరిష్ట వయోపరిమితిని మరో ఏడాదిపాటు పెంచడంతో అదనంగా 30 వేల దరఖాస్తులు వచ్చాయి.

మరిన్ని వార్తలు