విశ్వనగరం ఎలా సాధ్యం?

26 Jan, 2016 06:28 IST|Sakshi
విశ్వనగరం ఎలా సాధ్యం?

సమస్యలను గాలికొదిలేసిన టీఆర్‌ఎస్
స్థానిక సంస్థలను అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ
వీటిని కాక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు
ఎంచుకోవాలి.. ‘వన్‌హైదరాబాద్’ నేతలు
రాఘవులు, చాడ, జేపీ, తమ్మినేని, గౌస్ పిలుపు

 

సాక్షి, హైదరాబాద్: తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరం ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, లోక్‌సత్తా నేతలు ప్రశ్నించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని అసమర్థ, అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లను కాకుండా, స్వచ్ఛమైన పాలన అందించే తమ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో సోమవారం సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, లోక్‌సత్తా నేతలు జయప్రకాష్‌నారాయణ, పాండురంగారావు, ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పాత, కొత్త నగరాలు... ముస్లిం, హిందువు... తెలంగాణ, ఆంధ్రా, ఉత్తర భారత్ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటే అని గర్వంగా ప్రకటించడమే... ‘వన్ హైదరాబాద్’ అని అన్నారు.

 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు నిధులను హరించడం, సమస్యల పరిష్కారంలో చిన్న చూపు తప్ప స్థానిక సంస్థలపై నమ్మకం, గౌరవం లేదని బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల హక్కులను హరించి, పరోక్షంగా తామే పాలన సాగిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌లు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని జయప్రకాష్‌నారాయణ సూచించారు.

ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్‌సత్తా కూటమి నేతలు కావాలా?... ఎన్నికలను, పదవులను నిచ్చెనగా చేసుకుని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో?.. ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన వారే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ అవకాశవాదంతో ప్రకటనలు చేస్తున్నారని ఎండీ గౌస్ ఎద్దేవా చేశారు. రాజకీయ అనిశ్చితి కోసమే టీఆర్‌ఎస్ పనిచేస్తోందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు.
 

మరిన్ని వార్తలు