'బాబు పాలనంతా అవినీతిమయం'

2 Jul, 2016 13:44 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలకృష్ణ నిప్పులు చెరిగారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోర్టు ఏర్పాటు చేసేందుకు చైనా వారికి అనుమతి ఇస్తామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్క దేశాల్లో తాకట్టు పెడతారా ? అని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ నిలదీశారు. ఇది అంతర్గత భద్రతకు ముప్పు కాదా ? అని ప్రశ్నించారు.

చంద్రబాబు వైఖరిని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఏపీలోని సహజ వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని చంద్రబాబుకు వేణుగోపాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారని విమర్శించారు.

విదేశీ పర్యటనల వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని చంద్రబాబును వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనంతా అవినీతిమయం అంటు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన చైనా పర్యటనపై శుక్రవారం సాయంత్రం విజయవాడలో మాట్లాడిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని వేణుగోపాలకృష్ణ అన్నారు.

మరిన్ని వార్తలు