ఆ ఉద్యమకారుడికి న్యాయం దక్కేనా?

23 May, 2016 02:33 IST|Sakshi
ఆ ఉద్యమకారుడికి న్యాయం దక్కేనా?

- రోశయ్య హయాంలో సభలో జై తెలంగాణ అన్నందుకు పోలీస్ కేసు
- కేసు కారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన యువకుడు
- సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించినా దక్కని న్యాయం


సాక్షి, హైదరాబాద్: ‘జై తెలంగాణ’ అనే పిలుపునిచ్చినందకు ఓ యువకుని జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. ‘మా రాష్ట్రం రావాలి... మా కష్టం తీరాలి’ అని నినాదాలు చేసిన అతని బతుకు నడిరోడ్డుపై పడింది. ఉద్యమ నినాద ఫలితమే చేతికందిన ఉద్యోగం కోల్పోయి నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా బట్వారం మండలం రాంపూర్‌కు చెందిన చంద్రకాంత్‌రెడ్డి కానిస్టేబుల్‌గా ఎంపికైనా కొలువు దక్కడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కు చంద్రకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. 2010 చివరి నాటికి రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన అన్ని ఈవెంట్లు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చంద్రకాంత్ కూడా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అదే సందర్భంగా 2010 మే 17న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య రైతు చైతన్య యాత్రలు ప్రారంభించేందుకు బట్వారం మండలం యాచారంకు వచ్చారు. సభలో సీఎం రోశయ్య ప్రసంగిస్తుండగా ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలిచ్చాడు. సీఎం సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో చంద్రకాంత్‌రెడ్డితో సహా పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఈ కేసులో వికారాబాద్ కోర్టు రూ.300 జరిమానా విధించింది. అయితే కానిస్టేబుల్ కొలువుకు ఎంపికవడంతో రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన వెరిఫికేషన్‌లో చంద్రకాంత్‌పై కేసు నమోదై.. శిక్షపడినట్లు రుజువు కావడంతో పోలీస్ కొలువును నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఒక వైపు న్యాయస్థానాల చుట్టూ, మరోవైపు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా కానిస్టేబుల్ కొలువు దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా... ఉద్యమ కారుడికి మాత్రం న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఆఖరికి సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యను విన్నవించినా ఇప్పటికీ పరిష్కారం లభించడంలేదంటూ బాధితుడు వాపోతున్నాడు.

మరిన్ని వార్తలు