తెలంగాణతో కలసి పనిచేస్తాం

14 May, 2017 01:17 IST|Sakshi
తెలంగాణతో కలసి పనిచేస్తాం

- అమెరికా, ఆస్ట్రేలియా వీసాల అంశంపై ఆ దేశాలతో చర్చిస్తున్నాం
- ఎన్‌ఆర్‌ఐల అంశాలపై జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి వీకే సింగ్‌


సాక్షి, హైదరాబాద్‌ : ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ అన్నారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్లో ప్రభుత్వం ఆమోదించిన ఏజెంట్ల వివరా లు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారి వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిం చారు. హజ్‌యాత్రకు వెళ్లే వారి నుంచి ప్రైవేటు ఏజెంట్లు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని, వారిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రవాసీయులు, దౌత్య, పాస్‌పోర్టు సమస్యలపై విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ఇక్కడ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన తొలి సదస్సులో ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌ మంచి ప్రాంతం కావడం, ఇక్కడి ఎన్‌ఆర్‌ఐ శాఖ మంత్రి కె.తారకరామారావు డైనమిక్‌ కావడంతోనే తొలి సదస్సును తెలంగాణలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే భారతీయుల అవగాహన కోసం ‘సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి’ అనే నినాదంతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాస్‌పోర్టుల జారీని సరళతరం చేసేందుకు దేశంలోని 800కి పైగా ఉన్న హెడ్‌ పోస్టాఫీసులను దశలవారీగా పాస్‌పోర్టు సేవాకేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. మన దేశంతో ఒప్పందాలు చేసుకున్న దేశాల్లోని జైళ్లలో ఉన్న ప్రవాసీయులను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సౌదీ జైళ్లలో మగ్గుతున్న వాళ్లు అక్కడ లభిస్తున్న సౌకర్యాలు బాగుండటంతో జైళ్లలో ఉండేందుకు ఇష్టపడుతున్నారని, స్వదేశానికి వచ్చేందుకు ఇష్టపడటం లేదని చమత్కరించారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో భారతీయులపై ఇప్పటి వరకు ఎలాంటి వీసా ఆంక్షలు విధించలేదన్నారు.

సౌదీ కాన్సులేట్‌ ఏర్పాటుకు సహకరించండి
మన దేశంలో సౌదీ అరేబియా తమ రెండో కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, అందుకు హైదరాబాద్‌ సరైనదని సిఫారసు చేయాలని కేటీఆర్‌ కేంద్ర మంత్రి వీకే సింగ్‌ను కోరారు. రాష్ట్రంలో కొత్త పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో విదేశీ భవన్‌ ఏర్పాటుకు స్థల కేటాయింపులకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓయూ కుదుర్చుకు న్నాయి. కార్యక్రమంలో మంత్రి నాయిని, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ సీఎస్‌ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు