ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్

19 Dec, 2015 03:54 IST|Sakshi
ఏడాది పాటు ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్

♦ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏడాది పాటు వేటు
♦ సస్పెన్షన్‌ను ప్రతిపాదించిన యనమల.. మరుక్షణమే స్పీకర్ ఓకే
♦ వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వని వైనం
♦ ప్రతిపక్ష నేత అభ్యంతరాన్ని పట్టించుకోని స్పీకర్, ప్రభుత్వం
 
 సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్‌కే రోజాను శాసనసభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మూజువాణి ఓటుతో ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఉదయం నుంచి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు కాల్‌మనీ సెక్స్ వ్యవహారంపై వాగ్బాణాలు సంధించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం రోజాను లక్ష్యంగా ఎంచుకుంది. అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ, అన్‌పార్లమెంటరీ భాషను మాట్లాడారంటూ... రోజాను ఏడాదిపాటు సభకు రాకుండా సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు.

ఆయన ప్రతిపాదించిన మరు క్షణమే స్పీకర్ కోడెల రోజాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరూ రోజా సస్పెన్షన్ ఏకపక్ష నిర్ణయమని, దారుణమని స్పీకర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వడానికి స్పీకర్ నిరాకరించారు. తన ఆదేశాలే తుది నిర్ణయమని, సస్పెండ్ అయిన శాసనసభ్యురాలు బయటకు వెళితేనే మాట్లాడేందుకు అవకాశమిస్తానని స్పీకర్ తెగేసి చెప్పారు. ఒక దశలో స్పీకరే ఇరు పార్టీల సభ్యులు ఎవరైనా అసభ్యకర పదాలు వాడితే వాటిని రికార్డుల్లోంచి తొలగిస్తామని చెప్పారు.

స్వయానా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నాయకుడిపై తీవ్ర అసభ్య పదజాలాన్ని వాడారు. ఈ విషయాలు ప్రతిపక్ష పార్టీ సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా స్పీకర్ పట్టించుకోలేదు. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు లేచి... ఉరిశిక్ష పడిన వారికైనా తమ వాదన వినిపించుకోవడానికి అవకాశం ఇస్తారని, రోజాకు అవకాశం ఇవ్వాలని అన్నారు. దీనికి స్పీకర్...ఇది క్రమశిక్షణా చర్యకు సంబంధించిందని, ఆమె ముందు సభనుంచి బయటకు వెళ్లాలని లేదంటే ప్రతిపక్ష సభ్యుడికి మైక్ ఇవ్వడానికి కుదరదని అన్నారు. శాసనసభా వ్యవహారాల మంత్రి మళ్లీ కలుగ జేసుకుని.. సస్పెండ్ అయిన ఎమ్మెల్యే బయటకు వెళ్లకపోతే కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద మరో శిక్ష వేసే అవకాశముందని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

దీంతో తన వల్ల సభకు అంతరాయం కలుగుతోందని, తాను బయటకు వెళ్లనిదే తమ నాయకుడికి మైకు కూడా ఇవ్వని పరిస్థితిలో రోజా  బయటకు వెళ్లిపోయారు. అనంతరం ‘సభ జరుగుతున్న సమయానికి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం స్పీకరుకు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ కాలం సస్పెండ్ చేయాలంటే  ప్రివిలైజ్ కమిటీకి నివేదించాలి. అయితే ఇందుకు భిన్నంగా మా సభ్యురాలు ఆర్‌కే రోజాను సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధం..’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాయింట్ ఆర్డర్ ఆఫ్ లేవనెత్తారు. దీనిపై స్పీకరుగానీ, అధికార పక్షం గానీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు