ప్లూటోను గ్రహంగా గుర్తించండి

18 Feb, 2018 23:10 IST|Sakshi
ప్లూటో

ఆరేళ్ల చిన్నారి డిమాండ్‌

వాషింగ్టన్‌: నవగ్రహాల్లో ఒకటిగా ఉండి.. 2006లో గ్రహ హోదాను కోల్పోయిన ప్లూటోను మళ్లీ గ్రహంగా గుర్తించాలని ఆరేళ్ల చిన్నారి నాసాకు లేఖ రాసింది. వివరాల్లోకెళ్తే... ఐర్లాండ్‌కు చెందిన కారా ఒ కానర్‌ అనే ఆరేళ్ల బాలిక నుంచి నాసాకు ఓ లేఖ వచ్చింది. దాంట్లో.. ‘నేను ఒక సాంగ్‌ విన్నా.. దానిలో గ్రహాల జాబితాలో ప్లూటో చివరి వరుసలో ఉంది. క్యూపర్‌ బెల్ట్‌లోని నెప్యూట్‌ పక్కన ప్లూటో ఉంటుందనే విషయం నాకు తెలుసు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జుపిటర్‌ వరుసలో ప్లూటో కూడా ఉండాలి. మరుగుజ్జుదంటూ దానిని తొలగించడానికి వీల్లేదు. వెనే గ్రహాల లిస్టులో ప్లూలోను కూడా చేర్చండి. ఏ గ్రహం మరుగుజ్జుది కాదు.

భవిష్యత్తులో నేను కూడా ఆస్ట్రోనాట్‌ను కావాలనుకుంటున్నాన’ని పేర్కొంది. కానర్‌ లేఖకు నాసా డైరెక్టర్‌ స్పందిస్తూ... ‘నీ బాధ నాకు  అర్థమైంది. నువ్వు చెప్పిన దానితో నేనూ ఏకిభవిస్తున్నాను. కానీ ఈ ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ప్రతీది మారుతూ ఉంటుంది. ప్లూటో మరుగుజ్జు గ్రహమా కాదా అనేది పక్కనబెడితే దానిపై పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నాం. భవిష్యత్తులో నువ్వు ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టగలవనే నమ్మకం నాకుంది. అయితే అప్పటిదాకా నువ్వు చాలా బాగా చదువుకోవాలి. త్వరలో నాసాలో నిన్ను చూస్తానని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు