రోజుకు 7,400 మంది శిశువుల మృత్యువాత

14 Dec, 2015 18:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆగ్నేయాసియా ప్రాంతంలో శిశుమరణాలు నానాటికి పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిరోజు 7,400మంది అప్పుడేపుట్టిన శిశువులు మృత్యువాత పడుతున్నారని అది పేర్కొంది. వీటి నివారణను అత్యవసర పరిస్థితిగా తీసుకోకుంటే ఆందోళనకరంగా మారనుందని హెచ్చరించింది. అసలు ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో తెలియక తల్లులకు, కుటుంబాలకు తీరని వేదనగా మారాయని, వీటిపై దృష్టిసారించాలని సూచించింది.

ముందస్తు జాగ్రత్తలతో వీటిని 2/3శాతానికి తగ్గించవచ్చని ఆగ్నేయాసియా దేశాలకు సలహా ఇచ్చింది. బంగ్లాదేశ్, భుటాన్, కొరియా, భారత్, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ వంటి మొత్తం పదకొండు దేశాలు ఆగ్నేయాసియా ప్రాంతంలో ఉన్నాయి. ఈ దేశాల్లో గర్భంతో ఉన్న తల్లి పోషకాహారం తీసుకోకపోవడంతోపాటు డెలివరీ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల, జన్మించిన తొలిరోజుల్లో కూడా పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించడం వల్ల అనూహ్య మరణాలు సంభవిస్తున్నాయని, వీటిపై ప్రజల్లో అవగాహనను ఒక అత్యవసర కార్యక్రమంగా భావించి కల్పించడం ద్వారా శిశుమరణాలు తగ్గించవచ్చని ఆగ్నేయాసియా ప్రాంతాల ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు