‘ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు’

12 Dec, 2016 14:51 IST|Sakshi
‘ప్రియమైన ప్రపంచమా మళ్లీ కలుద్దాం.. సెలవు’

అలెప్పో: ఏడేళ్ల ప్రాయంలోనే తన ట్వీట్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కంటతడి పెట్టించిన అలెప్పో చిన్నారి బనా అలాబెడ్‌(7) జాడ కనిపించకుండా పోయింది. తన ట్విట్టర్‌ ఖాతా ఆదివారం నుంచి కనుమరుగైంది. అనతి కాలంలోనే దాదాపు లక్షమంది ఫాలోవర్స్‌ను సంపాధించుకుని వాళ్ల హృదయాలను ద్రవించజేసిన అలాబెడ్‌ ఆదివారం రాత్రి నుంచి ట్విట్టర్‌లో మాయమైంది. సిరియాకు చెందిన ప్రముఖ నగరం అలెప్పో నగరంలో ప్రస్తుతం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులకు, అమెరికా సంయుక్త సిరియా బలగాలకు మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఉగ్రవాదుల చెర నుంచి అలెప్పోను విముక్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ బలగాలు ముందుకు సాగుతుండగా బాంబుల వర్షం కురుస్తోంది. బాంబు శబ్దం, విస్పోటనాలు లేని రాత్రి అక్కడ లేదంటే ఆశ్చర్యం కాదు. అలాంటి పరిస్థితులను, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దౌర్భాగ్యాన్ని అలాబెడ్‌ గత సెప్టెంబర్‌ నుంచి తన తల్లి ఫతేమా క్రియేట్‌ చేసిన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. ‘మేమింకా బ్రతికే ఉన్నాం. ప్రపంచమా గుడ్‌ మార్నింగ్‌’ అంటూ ఈ మధ్యే ఓ ట్వీట్‌ చేసి గుండెలు పిండేసింది.

అలాంటి అలాబెడ్‌ గత నెల(నవంబర్‌) 27న ‘ఈ రోజు రాత్రి మాకు ఇల్లు లేదు. బాంబు దాడిలో అది ధ్వంసమైంది. నేను ఎంతోమంది మరణాలు చూశాను. నేను కూడా దాదాపు చనిపోయినట్లే’  అని ట్వీట్‌ చేయడంతోపాటు ఇప్పటకీ బాంబుల వర్షం కురుస్తోంది. మేం చావుకు బ్రతుకుకు మధ్య పోరాడుతున్నాం. మాకోసం ప్రార్థించండి’ అంటూ ట్వీట్‌ చేసింది. ఇక చివరిసారిగా ‘కచ్చితంగా  మమ్మల్ని ఆర్మీ అదుపులోకి తీసుకుంటుంది. ప్రియమైన ప్రపంచమా త్వరలోనే మనం మరోసారి కలుసుకుంటాం. ఇక సెలవు’ అని ట్వీట్‌ చేసింది. ఆ తర్వాత ఆదివారం రాత్రి నుంచి అలాబెడ్‌ ట్విట్టర్‌ ఖాతా నుంచి కనిపించకుండా పోయింది. పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా ఆమె సురక్షితంగా ఉండాలని వేడుకుంటున్నారు. భద్రతా బలగాలు వారిని ఏదో ఒక చోట భద్రంగా ఉంచి ఉంటారని, కుదురుకున్నాక అలాబెడ్‌ తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తుందని అనుకుంటున్నామని చెబుతున్నారు.

 

మరిన్ని వార్తలు