నేపాల్‌లో 8 మంది భారత పర్యాటకుల మృతి

21 Jan, 2020 18:45 IST|Sakshi
ఎవరెస్ట్‌ పనోరమ హోటల్‌, ఇన్‌సెట్లో ప్రవీణ్‌, శరణ్య వారి పిల్లలు

ఖాట్మండ్‌ : విహారయాత్ర వారి జీవితాలనే బలితీసుకుంది. నేపాల్‌ సందర్శనకు వెళ్లిన 8 మంది భారతీయులు అక్కడి హోటల్‌ రూమ్‌లో విగత జీవులుగా కనిపించారు. వారిని ఎయిర్‌ అంబులెన్స్‌లో ఖాట్మండ్‌లోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 15 మంది హాలిడే కోసం నేపాల్‌ వెళ్లారు. అక్కడ ఎవరెస్ట్‌ పనోరమ హోటల్‌లో 4 రూమ్‌లను బుక్‌ చేసుకున్నారు. వారిలో ఎనిమిది మంది ఒక రూమ్‌లో.. మిగిలినవారు ఇతర రూమ్‌ల్లో ఉన్నారు. ఒక రూమ్‌లో ఉన్న 8 మంది గదిలో వెచ్చదనం కోసం గ్యాస్‌ హీటర్‌ను ఆన్‌ చేశారు. అయితే అది సరిగా పనిచేయకపోవడంతో గ్యాస్‌ లీకైంది. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో వారు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

మరణించినవారిలో ప్రవీణ్‌ కృష్ణన్‌ నాయర్‌, అతని భార్య శరణ్య వారి ముగ్గురు పిల్లలు శ్రీభద్ర, అర్చన, అభి నాయర్‌, ప్రవీణ్‌ స్నేహితుడు రెంజిత్‌ కుమార్‌, అతని భార్య ఇందు, వారి కుమారుడు వైష్ణవ్‌ ఉన్నారు. అయితే కుమార్‌, ఇందుల మరో కుమారుడు మాధవ్‌ వేరే రూమ్‌లో పడుకోవడంతో.. అతనికి ప్రాణప్రాయం తప్పినట్టుగా సమాచారం. కాగా, ప్రవీణ్‌ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా.. శరణ్య మాత్రం కొచ్చిలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ సీఎం పినరయి విజయన్‌ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో మాట్లాడారు. మృతదేహాల తరలింపుతోపాటు, మిగిలిన పర్యాటకులకు సాయం అందించాల్సిందిగా కోరారు. 

మరిన్ని వార్తలు