'వీరి ప్రేమ ముందు ఏ వైరస్‌ నిలబడలేదు'

16 Feb, 2020 16:00 IST|Sakshi

బీజింగ్‌ : ప్రస్తుతం కోవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు 1500 మంది పైగా వైరస్‌ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన 87 ఏళ్ల వ్యక్తి కోవిడ్‌ వైరస్‌ సోకిన తన భార్యకు సపర్యలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ వృద్దుడు కూడా కోవిడ్‌ వైరస్‌ బారిన పడ్డాడు. వివరాలు.. కోవిడ్‌ వైరస్‌ బారిన పడినవారికి చైనా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి చికిత్సనందిస్తుంది. అయితే అందులోనే వైరస్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న 87 ఏళ్ల వృద్ధుడు పక్క వార్డులో ఉన్న తన భార్య దగ్గరకెళ్లి ఒక చేత్తో సెలైన్‌ బాటిల్‌ పట్టుకొని మరో చేత్తో ఆహారం, నీళ్లు అందించాడు. తర్వాత ఆమె పక్కనే కూర్చుని కంటికి రెప్పలా చూసుకున్నాడు.(ఆరోగ్య శత్రువు కోవిడ్‌–19)

ఇదంతా వీడియో తీసిన పీపుల్స్‌ డైలీ చైనా అనే సంస్థ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'మీ ప్రేమను చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది. 87 ఏళ్ల వ్యక్తి తన భార్య దగ్గరకెళ్లి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం ఆనందం కలిగించింది. కోవిడ్‌ లాంటి వైరస్‌లు ఎన్ని వచ్చినా వీరి ప్రేమను విడదీయలేవు. మీరిద్దరూ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం' అంటూ క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీడియో చూసిన వారంతా 87 ఏళ్ల వ్యక్తి తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా వైరస్‌: ఇదే చివరిసారి కలుసుకోవడం!)
(కోవిడ్‌-19 ఎఫెక్ట్‌: ఓ కంపెనీ ఏం చేస్తోందంటే)

>
మరిన్ని వార్తలు