అఫ్గానిస్తాన్‌ పగ్గాలు మళ్లీ ఘనీకే !

23 Dec, 2019 02:47 IST|Sakshi
అష్రాఫ్‌ ఘనీ, అబ్దుల్లా

ప్రాథమిక ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ

సవాల్‌ చేస్తానన్న అబ్దుల్లా  

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడుగా అష్రాఫ్‌ ఘనీ మళ్లీ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదివారం ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఘనీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. అష్రాఫ్‌ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్‌ ఎన్నికల కమిషన్‌ (ఈఏసీ) తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్‌ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. సెప్టెంబర్‌ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్‌ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థులు ఈఏసీ సక్రమ మైన పనితీరును కనబరచలేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి అంటోంది.

జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్‌ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది.  కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి  నెలకొంది. ఇక వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం అధ్యక్షురాలు హవా అలామ్‌ నురిస్తానీ తమకు అప్పగించిన బాధ్యతను నీతి, నిజాయితీ , చిత్తశుద్ధితో నిర్వహించామన్నారు.

ఫలితాలు పారదర్శకంగా లేవు: అబ్దుల్లా
ఎన్నికల ఫలితాలు వెలువడగానే అబ్దుల్లా కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో..‘మాకు ఓటు వేసిన ప్రజలకి, మద్దతుదారులకి, ఎన్నికల సంఘానికి, అంతర్జాతీయ మిత్రులకి మేం ఒకటే చెబుదామనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాల్ని మేం అంగీకరించడం లేదు. చట్టపరంగా మేం చేస్తున్న డిమాండ్లు తీర్చాల్సి ఉంది’’అని ఉంది.  
 

మరిన్ని వార్తలు