సెల్ఫీలకు నెలవు ‘మేఫీల్డ్స్‌’

23 Jul, 2019 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ : సెల్ఫీలు దిగడం అనేది ఈ రోజుల్లో వేలం వెర్రిగా మారిన విషయం తెల్సిందే. ఇక ‘ఇన్‌స్టాగ్రామ్‌’ లాంటి ఫొటో సోషల్‌ మీడియా బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సోలో, ఫ్రెండ్స్‌ ఫొటోలకు కూడా యమ డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో మంచి బ్యాక్‌గ్రౌండ్‌ కోసం యువతీ యువకులు అతి సుందర నందన వనాలను వెతుక్కుంటూ సుదూర తీరాలకు సైతం పోతున్నారు. దాంతో అనామక ప్రాంతాలు కూడా పాపులర్‌ అవుతున్నాయి. అలా ప్రసిద్ధి చెందినదే లండన్‌కు 15 మైళ్ల దూరంలోని సర్రీకి సమీపంలో ఉన్న ‘మేఫీల్డ్స్‌ లావెండర్‌ ఫామ్‌’. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ ఉదా రంగు పూల వికాసంతో కళకళలాడుతున్న ఆ తోటలోకి ఫొటోల కోసం పోటీ పడుతున్నారు.

ఇదే అదనుగా 25ఎకరాల ఆ తోట యజమాని మనిషికి ప్రవేశ రుసుమంటూ భారతీయ కరెన్సీలో దాదాపు 250 రూపాయలు విధించారు. అయినా లెక్క చేయకుండా జనం విరగబడుతూనే ఉన్నారు. వారాంతంలో ఫొటో సెషన్‌ కోసం వచ్చే వారి సంఖ్య మరీ పెరగడంతో తోట యజమాని అక్కడే తిష్టవేసి ‘మంచి ఫొటోలు తీసుకుంటే మళ్లీ మళ్లీ రావాల్సిన అవసరం ఉండదు’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదంతా వారాంతంలో రద్దీని తగ్గించడానికేనని ఆయన చెబుతున్నారు. ఇంతవరకు రెండు, మూడు లేదా ఐదు గంటలు అంటూ సమయాన్ని నిర్దేశించలేదని, రద్దీ పెరిగితే అది చేయాల్సి రావచ్చని చెప్పారు. ఇప్పటి వరకు ఫొటో సెషన్లకు ప్రసిద్ధి చెందిన ‘నాటింగ్‌ హిల్‌’, ‘కాట్స్‌వోల్డ్స్‌ విలేజ్‌’ ప్రాంతాలు వెనకబడి పోతున్నాయి.

మరిన్ని వార్తలు