సంచలనం: 'క్లింటన్‌ డబ్బు ఇస్తానన్నారు'

21 Jul, 2017 07:50 IST|Sakshi
క్లింటన్‌ డబ్బు ఇస్తానన్నారు: నవాజ్‌ షరీఫ్‌

ఇస్లామాబాద్‌: ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌.. పాకిస్తాన్‌ అణు పరీక్షలు జరపకుండా ఉండేందుకు తనకు ఐదు బిలియన్ల డాలర్లు ఇవ్వజూపినట్లు చెప్పారు. దేశానికి విధేయుడిని కాకపోతే ఆ డబ్బు తీసుకుని అణు పరీక్షలను నిలిపివేసేవాడినని అన్నారు. పంజాబ్‌ ప్రావిన్సులో ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో అణు పరీక్షల విషయాన్ని ప్రధాని షరీఫ్‌ బయటపెట్టారు.

1998లో తనను కలిసిన బిల్‌ క్లింటన్‌ అణు పరీక్షలు నిలిపివేయాలని కోరినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా ఐదు బిలియన్‌ డాలర్లను ఇస్తానని క్లింటన్‌ అన్నా.. తాను లొంగలేదని అన్నారు. అవినీతి కేసులో తీవ్ర చిక్కుల్లో ఇరుకున్న నవాజ్‌ షరీఫ్‌ అందులోంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయుధంగా వాడుకుంటున్నారు. పనామా పేపర్ల కుంభకోణం ప్రధాని కుర్చీని కుదిపేస్తుండటం, రాజీనామా చేయాలనే డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆయన ఇలా చేస్తున్నారని పాకిస్తాన్‌ మీడియా అంటోంది.

మరిన్ని వార్తలు