చైనాకు షాక్‌.. భారీ ప్రాజెక్టు రద్దు

24 Jan, 2018 14:49 IST|Sakshi
బంగ్లా-చైనా మైత్రికి చిహ్నంగా నిర్మిస్తోన్న హైవే పక్కన ఇరుదేశాధినేతల ప్రచార చిత్రాలు(ఫైల్‌)

ఢాకా : పరాయి దేశాల్లో భారీ ప్రాజెక్టుల ముసుగులో చైనా సాగిస్తోన్న అవినీతి కలాపం బట్టబయలైంది. ఉన్నతాధికారులకు విచ్చలవిడిగా లంచాలు పంచుతూ నిధులను దారిమళ్లించిన వ్యవహారం చర్చనీయాంశమైంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో చైనా ప్రఖ్యాత కంపెనీలతో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఒప్పందాలను రద్దుచేసుకోవడం సంచలనంగా మారింది.

‘ఢాకా-సిల్హట్‌ హైవే’లో అక్రమాలు : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, సిల్హట్‌ పట్టణాలమధ్య కొత్తగా హైవేను నిర్మిస్తున్నారు. బంగ్లాతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా చైనా ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా నడిచే చైనా హార్బర్‌ ఇంజనీరింగ్‌ కంపెనీయే హైవే నిర్మాణ పనులను చేపట్టింది. కాగా, ఈ ప్రాజెక్టు నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని చైనీస్‌ కంపెనీ భావించింది. అందుకు బాంగ్లా అధికారుల అనుమతి కూడా తప్పనిసరి కావడంతో లంచాల పంపకానికి తెరలేపారు. ‘‘బంగ్లా ట్రాన్స్‌పోర్ట్‌, బిల్డింగ్‌ శాఖ చీఫ్‌కు చైనీస్‌ కంపెనీవాళ్లు భారీగా లంచం ఇచ్చినట్లు తేలింది. ఇది దేశాలమధ్య కుదిరిన నిబంధనలకు విరుద్ధం. కాబట్టి చైనా కంపెనీని ప్రభుత్వం నిషేధించింది. మిగిలిపోయిన పనులు ఎవరు చెయ్యాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని బంగ్లాదేశ్‌ ఆర్థిక మంత్రి అమా ముహిత్‌ మీడియాకు చెప్పారు.

>
మరిన్ని వార్తలు