చైనాలో ‘చాయ్‌ పే చర్చా’..!

28 Apr, 2018 11:20 IST|Sakshi
‘చాయ్‌ పే చర్చా’లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌

వుహాన్‌, చైనా : భారత్‌, చైనాల మధ్య సుహృద్భావ సంబంధాలను నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండు రోజుల అనధికార భేటీల్లో భాగంగా శనివారం ఉదయం ఇరు దేశాధినేతలు ‘చాయ్‌ పే చర్చా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరూ టీ తాగుతూ తూర్పు సరస్సు తీరంలోని ప్రకృతి అందాల్ని ఆస్వాదించారు.

తీరం వెంబడి పక్క పక్కనే నడుచుకుంటూ ఇరుదేశాల మధ్య మెరుగుపడాల్సిన సంబంధాలపై మాట్లాడుకున్నారు. ప్రధానంగా భారత్‌, చైనాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటివి ఈ సందర్భంగా చర్చకు వచ్చాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్‌ ఎంఈఏ ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. మోదీ, జిన్‌పింగ్‌ల ఫోటోలను ట్వీట్‌కు జోడించారు.

షీ జిన్‌పింగ్‌తో రెండు రోజుల ఈ అనధికార చర్చలు చరిత్రాత్మకం అంటూ మోదీ పేర్కొన్నారని రవీష్‌ తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన దీర్ఘకాలిక సత్సంబంధాలు ఏర్పడాలంటే.. ‘కామన్‌ థింకింగ్‌, కామన్‌ రిలేషన్స్‌, కామన్‌ కో-ఆపరేషన్‌, కామన్‌ ఆస్పిరేషన్‌, కామన్‌ డ్రీమ్స్’ అనే అయిదు కీలకాంశాలు అవసరమని మోదీ పేర్కొన్నారని రవీష్‌ ట్వీట్‌లో వివరించారు.

మరిన్ని వార్తలు