జూ సిబ్బందికి చుక్కలు చూపించిన చాచా

15 Apr, 2016 10:29 IST|Sakshi
జూ సిబ్బందికి చుక్కలు చూపించిన చాచా

టోక్యో: జపాన్లో ఓ చింపాంజీ జూ అధికారులకు చుక్కలు చూపించింది. తనను బంధించి ఉంచిన నెట్కు పెద్ద కన్నం చేసి అందులో నుంచి పారిపోయింది. అనంతరం ఒక పెద్ద విద్యుత్ స్తంభాన్ని ఎక్కి కూర్చుని వెర్రికూతలు కూయడం ప్రారంభించింది. తొలుత జూలో నుంచి చింపాంజీ తప్పిపోయినట్లు జూ ఉద్యోగులు ఉన్నతాధికారులకు చెప్పడంతో శరవేగంగా కదిలారు. సెండాయ్ లోని యాగియామా అనే పెద్ద జూపార్క్ ఉంది. అందులో చాచా అనే ఓ చింపాంజీ ఉంది.

అది గురువారం సాయంత్రం అధికారుల కళ్లు గప్పి తెలివిగా తప్పించుకుంది. దీంతో ఉలిక్కిపడిన అధికారులు కిందా మీదా పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలో చూడగా అది ఒక పెద్ద కరెంటు స్తంభం ఎక్కినట్లు గుర్తించారు. తర్వాత దానిని కిందికి దించేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోగా వారిపై కోపంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. బాణం లాంటిదాంతో దాని వీపుపై గుచ్చగా దాన్ని లాక్కొని కిందపడేసి విద్యుత్ తీగల గుండా తప్పింకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అది జారి కింద అప్పటికే సిద్ధం చేసి ఉంచిన బోనులో పడిపోయింది. ఈ క్రమంలో దానికి స్వల్పగాయాలయ్యాయి. కాగా, అసలు చాచా తప్పించుకునేందుకు గల కారణాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై చర్చించేందుకు శుక్రవారం ఆ జూను మూసివేశారు.

మరిన్ని వార్తలు