ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఏరివేతకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం!

2 Dec, 2023 12:24 IST|Sakshi

టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమార్చాలని గూఢచారి సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

టర్కీ, లెబనాన్, ఖతార్‌లలో హమాస్ నాయకులను వేటాడేందుకు ఇజ్రాయెల్ గూఢచారి ఏజెన్సీలు ఇప్పటికే నిఘా పెట్టాయి. హమాస్ వర్గానికి ఖతార్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాజధాని దోహాలో హమాస్ కార్యకలాపాలను దశాబ్దంపాటు కొనసాగించేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగించేందుకు కూడా ఖతార్ కీలక పాత్ర పోషించింది. 

ఖతార్, ఇరాన్, రష్యా, టర్కీ, లెబనాన్,లు హమాస్‌ కార్యకలాపాలకు అవకాశం కల్పించాయని యుఎస్‌ ఇప్పటికే ఏన్నోసార్లు ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంక్షోభాలను తొలగించడానికి ఇజ్రాయెల్ కూడా ఇన్నాళ్లు హమాస్‌ను ఇతర దేశాల్లో లక్ష్యంగా చేయలేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్‌ను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

హమాస్ నాయకులను వేటాడి హతమార్చాలని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించడం ఇజ్రాయెల్‌లోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులలో చర్చకు దారితీసింది. మాజీ మొస్సాద్ డైరెక్టర్ ఎఫ్రైమ్ హేలేవీ దీనిని తప్పు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. హమాస్ నాయకులను నిర్మూలించడం వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తొలగిపోదని తెలిపారు. అందుకు బదులుగా హమాస్ అనుచరులు మరింత ఘోరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.  

ఇదీ చదవండి: గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి

మరిన్ని వార్తలు