ఓకే రన్‌వేపై గంటల వ్యవధిలోనే ప్రమాదానికి గురైన రెండు విమానాలు

2 Dec, 2023 12:19 IST|Sakshi

తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రోజు, ఒకే ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. కేవలం గంటల వ్యవధిలోనే ఒకే రన్‌వేపై అదుపుతప్పాయి. కికోబోగా ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ  ఊపిరి పీల్చుకున్నారు.

వివరాలు..యునైటెడ్ ఎయిర్ జాంజిబార్ విమానం 30 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బందితో జాంజిబార్‌ నుంచి బయల్దేరింది. కికోబోగా విమానాశ్రయంలో దిగుతుండగా రన్​వేను తాకగానే ల్యాండింగ్ గేర్ ఊడిపోయింది. దీంతో విమానం రన్​వేపై నుంచి కొద్దిదూరం పక్కకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో విమానానికి బాగా నష్టం వాటిల్లినప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.

కాగా ఉదయం జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎయిర్​పోర్టు సిబ్బంది తేరుకోకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం ఆరుగంటలకే కికోబోగా ఎయిర్‌పోర్ట్‌ నుంచి జాంజిబార్ వెళ్లేందుకు మరో విమానం సిద్ధమైంది. 30 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో జాంబిజార్​కు వెళ్లడానికి బయలు దేరింది. రన్​వేపై స్పీడ్ అందుకున్నాక గాల్లోకి లేవాల్సిన విమానం అదుపుతప్పి రన్ వే చివర్లో ఉన్న ఓ బిల్డింగ్‌ను బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కూడా విమానం చాలా వరకూ దెబ్బతిన్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలి వద్ద భారీగా పొగలు వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
చదవండి: ఆలస్యం వద్దు.. నిషేధించండి: బైడెన్‌కు లేఖ

మరిన్ని వార్తలు