పథకం ప్రకారమే డ్రాగన్‌ దాడి! 

29 Jun, 2020 01:27 IST|Sakshi
భారత్‌–చైనా సరిహద్దులో కాంగ్‌కా పాస్‌ వద్ద చైనా ఏర్పాటు చేసిన స్థావరాలు (ఉపగ్రహ చిత్రం)

గల్వాన్‌ ఘటనకు ముందే లాసాలో మోహరింపు

చైనా ఆర్మీలో మార్షల్‌ యోధులు, పర్వతారోహకులు

భారత్‌ బలగాలపై దాడిలో వారి హస్తం!

బీజింగ్‌: చైనా పక్కా పథకం ప్రకారమే గల్వాన్‌ సరిహద్దుల్లో భారత్‌పై కయ్యానికి కాలు దువ్వినట్టుగా తెలుస్తోంది. జూన్‌ 15 రాత్రి ఘర్షణలకి ముందే కరాటే, కుంగ్‌ఫూ వంటి యుద్ధ కళల్లో ఆరితేరిన మార్షల్‌ యోధులు, ఎవరెస్టు వంటి పర్వత శ్రేణుల్ని అలవోకగా ఎక్కగలిగే నైపుణ్యం కలిగిన వీరుల్ని చైనా సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియానే స్వయంగా వెల్లడించింది. సరిహద్దుల్లో తనిఖీల పేరుతో చైనాకు చెందిన అయిదు మిలటరీ బృందాలు జూన్‌ 15న టిబెట్‌ రాజధాని లాసాకు చేరుకున్నాయి.

ఈ బృందాల్లో మౌంట్‌ ఎవరెస్ట్‌ ఒలంపిక్‌ టార్చ్‌ రిలే బృందానికి చెందిన మాజీ సభ్యులు, మార్షల్‌ ఆర్ట్స్‌ క్లబ్‌కి చెందిన సభ్యులు ఉన్నట్టు చైనా అధికారిక మిలటరీ పత్రిక చైనా నేషనల్‌ డిఫెన్స్‌ న్యూస్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. లాసాలో భారీగా కొత్త సైనిక దళాలు మోహరించి ఉన్న దృశ్యాలను చైనా టీవీ ప్రసారం చేసింది. సరిహద్దుల్ని బలోపేతం చేయడానికి, టిబెట్‌లో సుస్థిర పరిస్థితులు నెలకొల్పడానికి మార్షల్‌ యోధులు, పర్వతారోహకుల్ని మోహరించినట్టు చైనా పత్రిక రాసుకొచ్చింది.  

దాడికి పాల్పడింది వారేనా? 
గల్వాన్‌ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఈ మార్షల్‌ యోధులే భారత సైనికులపై దాడి చేశారా లేదా అన్నది చైనా అధికారికంగా స్పష్టంగా చెప్పడం లేదు. అసలు వారి వైపు ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారో ఇంతవరకు వెల్లడించలేదు. వీరినే గల్వాన్‌ ప్రాంతానికి తరలించాలో లేదో ఇంకా తెలియాల్సి ఉందని టిబెట్‌ కమాండర్‌ వాంగ్‌ హీజియాంగ్‌ పేర్కొన్నారు. కానీ లాసా నుంచే వీరిని గల్వాన్‌ లోయకి పంపినట్టుగా అనుమానాలైతే ఉన్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో అడపాదడపా ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ గత 50 ఏళ్లలో ఈ స్థాయిలో హింసాత్మక ఘర్షణలు చెలరేగడం ఇదే మొట్టమొదటిసారి అన్న విషయం తెలిసిందే.

చైనా నిర్మాణాలు 33 రోజుల్లో
భారత్‌లోని లద్దాఖ్‌లో గల్వాన్‌ లోయ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా 33 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసినట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది.  మే 22 నుంచి జూన్‌ 26 వరకు ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే చైనా ఏ స్థాయిలో నిర్మాణాలు చేస్తోందో అర్థమవుతుంది. చైనా ఆర్మీ మన దేశ భూభాగంలోకి 137 మీటర్ల మేర చొచ్చుకు వచ్చిన చిత్రాలను చూపిస్తూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. మేలో కనిపించని  కొన్ని నిర్మాణాలు జూన్‌లో తీసిన చిత్రాల్లో స్పష్టంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గల్వాన్‌ నదీ తీర ప్రాంతంలో రాతితో నిర్మించిన గట్టు.

ఈ నిర్మాణం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 50 మంది సైనికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ రాతి గట్టు సమీపంలో నాలుగు శిబిరాలను కూడా నిర్మించారు. గులాబీ రంగులో నిర్మించిన టెంట్లు చాలా స్పష్టంగా చిత్రాల్లో కనిపిస్తున్నాయి. జూన్‌ 15 రాత్రి చైనా, భారత్‌ మధ్య ఘర్షణల సందర్భంగా బయటకు వచ్చిన ఛాయాచిత్రాలు,  వీడియోల్లో రాతి గట్టుకి సంబంధించిన నిర్మాణాలు స్పష్టంగా కనిపించలేదు. కానీ జూన్‌ 22 నుంచి 26 మధ్య తీసిన ఛాయా చిత్రాల్లో రాతి నిర్మాణం, పింక్‌ టెంట్లు కనిపిస్తున్నాయి. చర్చలకు కట్టుబడి సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఆ దేశం చెబుతున్నవన్నీ అబద్ధాలేననటానికి ఇవే సాక్ష్యం.

మరిన్ని వార్తలు