కోవిడ్‌ మృతులు 1,500

15 Feb, 2020 04:26 IST|Sakshi

65 వేలకు చేరిన బాధితుల సంఖ్య

జపాన్‌ ఓడలోని ముగ్గురు భారతీయులకు వైరస్‌

బీజింగ్‌/టోక్యో/న్యూఢిల్లీ: చైనాలో ప్రమాదకర కోవిడ్‌–19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉన్న హుబే ప్రావిన్స్, తదితర ప్రాంతాల్లో ఒక్క రోజులోనే 121 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,500కు చేరుకుంది. అదేవిధంగా, చైనాలోని 31 ప్రావిన్స్‌ల్లో మరో 5,090 కేసులు కొత్తగా బయటపడగా వీటిలో 4,823 కేసులు వ్యాధి మూలాలు మొదట గుర్తించిన హుబే ప్రావిన్స్‌లోనివే కావడం గమనార్హం. దీంతో దేశం మొత్తమ్మీద బాధితుల సంఖ్య గురువారానికి 64,894కు చేరుకుంది. అలాగే, కోవిడ్‌ బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తూ వైరస్‌ సోకిన 1,700 మంది ఆరోగ్య సిబ్బందిలో ఆరుగురు చనిపోయారని చైనా  ప్రకటించింది.  

జపాన్‌ ఓడలో ముగ్గురు భారతీయులకు..  
కోవిడ్‌–19 వైరస్‌ అనుమానంతో జపాన్‌ తీరంలో నిలిపేసిన ఓడలోని 3,711 మందిలో 218 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా వీరిలో ముగ్గురు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. డైమండ్‌ ప్రిన్సెస్‌ అనే ఈ ఓడలోని 138 భారతీయుల్లో 132 మంది సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులున్నారు. దీంతోపాటు ఓడలోని కోవిడ్‌ నెగటివ్‌గా నిర్ధారించిన 11 మంది 80 ఏళ్లు పైబడిన వృద్ధులను జపాన్‌ అధికారులు శుక్రవారం బయటకు పంపించారు.  టోక్యోకు చెందిన ఓ వృద్ధురాలు కోవిడ్‌తో మృతి చెందినట్లు జపాన్‌ తెలిపింది.

భారత్‌లో పరిస్థితి అదుపులోనే..
దేశంలో కోవిడ్‌ (కరోనా) వ్యాప్తి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ తెలిపారు. చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని, వీరిలో ఒకరు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. చైనా, హాంకాంగ్, థాయ్‌లాండ్, సింగపూర్‌ దేశాల నుంచి వచ్చే వారికి దేశంలోని 21 ఎయిర్‌పోర్టుల వద్ద స్క్రీనింగ్‌ కొనసాగుతుండగా, ఈ జాబితాలో జపాన్, దక్షిణకొరియాలను కూడా చేర్చినట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది.   

మరిన్ని వార్తలు