అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహం

24 May, 2018 18:12 IST|Sakshi
చైనా విదేశీ వ‍్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం

హఫీజ్‌ తరలింపు వార్తలను ఖండించిన చైనా

బీజింగ్‌: అంతర్జాతీయ మీడియా అత్యుత్సాహంపై చైనా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ తరలింపు వ్యవహారంలో వస్తున్న వార్తలను ఖండించింది. ఈ మేరకు గురువారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నిరాధారమైన ఈ వార్తలు షాక్‌కు గురిచేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, జమాతే ఉద్‌ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి పాక్‌ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు తరలించమని జిన్‌పింగ్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అదంతా నిరాధారం. మేం ఎలాంటి సూచనలు చెయ్యలేదు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌పై చర్యలు తీసుకోవాలని అమెరికాతోపాటు భారత్‌ కూడా పాక్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సయీద్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు పంపించాలని గత నెల బీజింగ్‌లోని బావో ఫోరమ్‌ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్‌, పాక్‌ ప్రధాని అబ్బాసీతో సమావేశమైనపుడు కోరినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇరు దేశాధినేతలు దాదాపు అరగంట పాటు సయీద్‌ అంశం గురించి చర్చించినట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు సైతం ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే డ్రాగన్‌ కంట్రీ ఖండన ప్రకటన విడుదల చేసింది. కాగా, హఫీజ్ సయీద్‌ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా, అతడిపై 10 మిలియన్ల డాలర్ల రివార్డును ప్రకటించింది. 

మరిన్ని వార్తలు