టాయిలెట్ విప్లవం.. ఇక్కడ కాదు!

29 May, 2017 19:07 IST|Sakshi
టాయిలెట్ విప్లవం.. ఇక్కడ కాదు!

అభివృద్ధిలో చైనా చాలా దూసుకెళ్లిపోతోందని అనుకుంటాం. అక్కడంతా అత్యాధునిక నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకొంటాం. కానీ, అక్కడ పందుల పెంపకం కేంద్రాలకు సమీపంలోనే బహిరంగ మల విసర్జన జరుగుతోందట. ఇలాంటి వాటిని నివారించడానికి గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ విప్లవం' ఒకటి మొదలుపెట్టి, సుమారు 52 వేల టాయిలెట్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్తగా నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యంలో 92.7 శాతాన్ని చేరుకున్నామని చైనా నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (సీఎన్‌టీఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పేరు.. 'ప్రోగ్రెస్ ఆఫ్ ద టాయిలెట్ రివల్యూషన్'.

2015 సంవత్సరంలో చైనా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ రివల్యూషన్' ప్రారంభించింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లోను, పర్యాటక ప్రాంతాల వద్ద ఉన్న టాయిలెట్ల వల్ల ఆ దేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందని గుర్తించారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు సరైన టాయిలెట్లు లేవు. పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్లు తగినంతగా లేకపోవడం, పారిశుధ్య కార్మికులు కూడా సరిపడ సంఖ్యలో లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కాలంలో 33వేల టాయిలెట్లను కొత్తగా కట్టాలని, 24 వేల టాయిలెట్లను పునర్నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న టాయిలెట్లను త్రీ స్టార్ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తామని సీఎన్‌టీఏ అప్పట్లో చెప్పింది.

మరిన్ని వార్తలు