కృష్ణా వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

17 Aug, 2019 21:35 IST|Sakshi

వరదల పరిస్థితిపై నివేదికలు సమర్పించిన సీఎంఓ అధికారులు

సాయం అందించడంలో అలసత్వం వదన్న వైఎస్‌ జగన్‌

వాషింగ్టన్‌ డీసీ నుంచి డల్లాస్‌ వెళ్లనున్న ముఖ్యమంత్రి

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణానది వరదలపై సమీక్ష నిర్వహించారు. సీఎంఓ అధికారులు పంపించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఎగువనుంచి వస్తున్న వరద నీరు, విడుదల చేస్తున్న జలాలపై ఆరా తీశారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్ష చేశారు. బాధితులకు సహాయం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. వరద సహాయ కార్యక్రమాలు చురుగ్గా, వేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రికి సీఎంఓ అధికారులు వివరించారు.

ఇక వాషింగ్టన్‌ డీసీ నుంచి సీఎం జగన్‌ డల్లాస్‌ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30) డల్లాస్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ప్రముఖులను కలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం జగన్‌ రాక నేపథ్యంలో డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం జగన్‌ సభకోసం ప్రవాసాంధ్రులు భారీగా తరలివస్తున్నారు.

మరిన్ని వార్తలు