అమెరికాలో కరోనా విస్ఫోటనం!

25 Mar, 2020 03:26 IST|Sakshi
న్యూయార్క్‌లో వైద్య సామగ్రి వద్ద  కాపలాగా ఉన్న భద్రతా బలగాలు 

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తీవ్రతిప్పుడు అమెరికాలో ఎక్కువైంది. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.

అక్రమ నిల్వలపై ఉక్కుపాదం: ట్రంప్‌
మాస్కులు, శానిటైజర్లు ఇతర మందులను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా అధ్యక్షుడు ట్రంప్‌  ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. అమెరికాలోని న్యూయార్క్‌ ప్రస్తుతం కోవిడ్‌కు కేంద్రబిందువుగా మారింది. అమెరికాలో కోవిడ్‌ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్‌కు చెందిన వారే. సోమవారం సుమారు 5085 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ మహానగరంలో ఇప్పటివరకూ ఉన్న కేసుల సంఖ్య 20,875కు ఎగబాకింది. న్యూయార్క్‌లో ఇప్పటికే 43 మంది మరణించారు. న్యూయార్క్‌ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‌హౌస్‌లో కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారి డెబ్రా ఎల్‌ బ్రిక్స్‌ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్‌ స్టేట్, కాలిఫోర్నియాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, తగినని మందులు, ఇతర పరికరాలను అక్కడకు పంపిస్తున్నామని తెలిపారు. ఫెడరల్‌ ఎమర్జెన్సీ ఏజెన్సీ సుమారు 80 లక్షల ఎన్‌–95 మాస్కులను పంపిణీ చేస్తోందని, కోటీ 33 లక్షల సర్జికల్‌ మాస్కులూ అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌–19పై ప్రభావం చూపే మందుల కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని, క్లోరోక్వైన్‌ వంటి యాంటీ మలేరియా మందుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. (భారత్‌ @ 519)

ఇరాన్‌లో మరో 122 మంది మృతి
మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌లో మంగళవారం మరో 122 మంది మరణించడంతో కోవిడ్‌ –19 కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1934కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 1762 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ మొత్తం 24,811 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని అధికార ప్రతినిధి కియానౌష్‌ జహాన్‌పౌర్‌ ఒక టెలివిజన్‌ ప్రకటన ద్వారా తెలిపారు.

స్పెయిన్‌లో ఒక్క రోజులో 544 మరణాలు
స్పెయిన్‌లో కోవిడ్‌ –19 విలయం కొనసాగుతోంది. ఒక్క రోజులో ఏకంగా 514 మరణాలు సంభవించగా ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2696కు చేరిందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 40 వేలుగా ఉంది. 
►స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో మరణాల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో అక్కడి ఒక ఐస్‌ రింక్‌ను తాత్కాలిక మార్చురీగా మార్చారు.
►ఫ్రాన్స్‌లోని ముల్‌హౌస్‌లో వైరస్‌ బాధితులు ఎక్కువగా ఉండటంతో పొరుగున ఉన్న జర్మనీ, స్విట్జర్లాండ్‌ల వైద్యులు వైద్యం అందిస్తున్నారు.
►అత్యవసరం కాని కార్యకలాపాలన్నింటిపై మూడు వారాల నిషేధం ప్రకటించిన మరుసటి రోజు బ్రిటన్‌లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైళ్లు, సబ్‌వేలు కిక్కిరిసిపోవడంతో లండన్‌ మేయర్‌ సాదిఖ్‌ ఖాన్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. (హుబేలో లాక్‌డౌన్‌ ఎత్తివేత?)

మరిన్ని వార్తలు