ఉడుత పచ్చి మాంసం తిన్న దంపతులు..

9 May, 2019 13:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాస్కో : మెరుగైన ఆరోగ్యం కోసమని ఉడుత పచ్చి మాంసాన్ని తిన్న దంపతులు మృత్యువాత పడ్డారు. ప్లేగు వ్యాధితో వారు మరణించడంతో ఇరుగుపొరుగు వాళ్లతో పాటు స్థానిక ప్రజలంతా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఘటన మంగోలియా- రష్యా సరిహద్దులోని సగనూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగోలియా సరిహద్దు వద్ద భద్రతా ఏజెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి అనారోగ్యం సోకడంతో ఉడుత మాంసం తినాలని భావించాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి ఉడుత కిడ్నీలు, గాల్‌ బ్లాడర్‌, ఉదర భాగాన్ని పచ్చిగానే ఆరంగించాడు. దీంతో ఇన్‌ఫెక్షన్‌ సోకి జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు శరీరంలోని వివిధ అవయవాలు పాడైపోవడంతో రావడంతో సదరు వ్యక్తి పదిహేను రోజుల క్రితం మరణించగా.. ఈనెల 1న అతడి భార్య ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో సగనూర్‌ పట్టణ ప్రాంతం‍లో అలర్ట్‌ విధించడంతో స్థానికులంతా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పయనమవుతున్నారు.

ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వాలంటీర్‌ ఆరిన్‌తుయా ఓచిర్‌పురేవ్‌ మాట్లాడుతూ.. పచ్చి మాంసం తినడం వల్లే దంపతులిద్దరు చనిపోయారని పేర్కొన్నారు. వీరికి తొమ్మిది నుంచి 14 నెలల వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. మృతులకు సోకిన అత్యంత ప్రమాదకర నిమోనిక్ ప్లేగు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే కారణంగా ప్రభుత్వాధికారులు ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించారు. ప్రజలతో పాటు టూరిస్టులను కూడా వేరే చోటికి తరలిస్తున్నారని పేర్కొన్నారు.

కాగా 2010-15 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 మందికి ప్లేగు వ్యాధి సోకగా.. అందులో 584 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. అదే విధంగా అమెరికాలో ఏడాదికి సగటున ఏడు ప్లేగు వ్యాధి కేసులు నమోదవుతున్నాయని సీడీసీ పేర్కొంది. ముఖ్యంగా న్యూ మెక్సికో, నార్తన్‌ అరిజోనా, సదరన్‌ కొలరెడో, కాలిఫోర్నియా, సదరన్‌ ఓరెగాన్‌, వెస్ట్రన్‌ నెవాడలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఇక పచ్చి మాంసం తినడం వల్ల మరణాలు సంభవించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని హవాయి యూనివర్సిటీ ట్రాపికల్‌ మెడిసన్‌ డైరెక్టర్‌ విలియం గోస్నెల్‌ అన్నారు. పచ్చి మాంసం తినడం వల్ల శరీరంలోకి అనేక రకాల చెడు బ్యాక్టీరియా సులభంగా ప్రవేశించి.. ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుందని పేర్కొన్నారు. దీని కారణంగా విపరీతమైన కడుపు నొప్పి , తలనొప్పి,  తీవ్ర జ్వరం, షాక్‌కు గురవ్వడం, చర్మ సంబంధ వ్యాధులు సోకుతాయని తెలిపారు.ఉడికించి తినడం వల్ల మాంసంలోని బ్యాక్టీరియా చనిపోతుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు