దావూద్‌ రైట్‌ హ్యాండ్‌.. రకరకాల కథలు

21 Dec, 2017 11:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దావూద్‌ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, గ్యాంగ్‌స్టర్‌ ఛోటా షకీల్‌ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావూద్‌ కుడి భుజంగా మెదులుతూ దశాబ్దాలుగా డీ-గ్యాంగ్‌ కార్యకలాపాలను షకీలే చూసుకుంటున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రాణాలతో లేడనేది దాని సారాంశం. 

దీనికి రకరకాల కథనాలు వినిపిస్తుండగా.. అందులో ఓ కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. పాక్‌ నిఘా సంస్థ ఇంటర్‌-సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ISI) అతన్ని ప్రాణాలు తీసిందంట. షకీల్‌కు, దావూద్‌కు మనస్ఫర్థలు వచ్చాక.. వారి మధ్య సయోధ్య కోసం ఐఎస్‌ఐ మధ్యవర్తిత్వం వహించిందని... అయితే అది విఫలం కావటంతో షకీల్‌ ఏక్షణానైనా తమ దేశానికి వ్యతిరేకంగా మారి భారత్‌కు సహకరిస్తాడన్న ఉద్దేశంతోనే చంపిందన్నది ఆ కథనం సారాంశం. 

చంపేశాక శవాన్ని సీ-130 రవాణా విమానంలో కరాచీకి తరలించి. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని.. ఈ విషయం ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్త పడ్డారంట. ఇక షకీల్‌ కుటుంబ సభ్యులను లాహోర్‌లోని ఓ ఇంటికి తరలించారని... దావూద్‌కు కూడా ఈ సమాచారం ఆలస్యంగా చేరిందనేది అందులో పేర్కొని ఉంది. ఇక మిగతా కథల్లో..  జనవరి 6, 2017న ప్రత్యర్థులు అతన్ని చంపారని.. ఈ మేరకు అతని గ్యాంగ్‌కు చెందిన బిలాల్‌కు ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్‌కు మధ్య జరిగిన ఆడియో సంభాషణల టేపు ఒకటి చక్కర్లు కొడుతోంది. గుండెపోటుతో మరణించాడనేది మరో కథనం వినిపిస్తోంది. 

మరో కథలో అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. దావూద్‌తో సంబంధాలను తెగదెంపులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడని చెబుతున్నారు. కానీ, గతంలో ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూలో షకీల్‌ మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు భాయ్‌(దావూద్‌) తోనే ఉంటాడని చెప్పటం చూశాం. ఏది ఏమైనా ప్రస్తుతం అతని జాడ అంతుచిక్కకపోవటంతో అతను బతికున్నాడా? లేదా? అన్న విషయంపై భారత నిఘా వర్గాల్లో కూడా  స్పష్టత కొరవడింది. గతంలో దావూద్‌ విషయంలో కూడా ఇలాగే అనారోగ్యం.. చావుబతుకుల్లో ఉన్నాడంటూ వార్తలు రావటం చూశాం.

దావూద్‌ కోసం భారత్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇది కూడా చదవండి

మరిన్ని వార్తలు