ఉగ్ర పైశాచికం

3 Jul, 2016 03:00 IST|Sakshi
ఉగ్ర పైశాచికం

ఢాకా రెస్టారెంట్‌లో ముష్కరుల మారణకాండ
20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపిన వైనం

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్‌లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికిచంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బందీల మతం గురించి తెలుసుకునేందుకు వారిని ఖురాన్ వాక్యాలు చెప్పాల్సిందిగా అడిగి మరీ చెప్పలేని వారిని హింసించి చంపారు. చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా రాత్రికి భోజనాలు కూడా ఏర్పాటుచేశారు.

ఢాకాలో అత్యంత భద్రత గల గుల్షన్ దౌత్య ప్రాంతం సమీపంలోని హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌పై ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి దాడిచేయడం తెలిసిందే. రెస్టారెంట్‌లో 40 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్న ముష్కరులు.. వారిలో 20 మందిని కత్తుల వంటి పదునైన ఆయుధాలు ఉపయోగించి హత్యచేశారు. ఉగ్రవాదులు పంజా విసిరిన పది గంటల తర్వాత శనివారం ఉదయం బంగ్లాదేశ్ కమాండోలు సాయుధ చర్య చేపట్టి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరొక ముష్కరుడిని ప్రాణాలతో బంధించారు. సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికే.. ఉగ్రవాదులు 20 మంది విదేశీ బందీలను గొంతుకోసి చంపేశారని మిలటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ బ్రిగేడియర్ జనరల్ నయీమ్‌ఆష్ఫాక్ చౌదురి తెలిపారు.
వీదేశీ బందీలను..
మృతుల్లో తారుషి జైన్ అనే 19 ఏళ్ల భారతీయ యువతి కూడా ఉంది. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో చదువుతోంది. ఆమె తండ్రి సంజీవ్ జైన్ గత 15-20 ఏళ్లుగా బంగ్లాలో బట్టల షాపు నడుపుతున్నారు. తారుషి సెలవులు గడిపేందుకు ఢాకా వెళ్లి రెస్టారెంట్‌లో ఉగ్రవాదులకు బలైంది. ఇదే సమయంలో మరో భారతీయ పౌరుడు ఉగ్రవాదుల మారణకాండ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోగలిగాడు.

అతడు బెంగాలీ భాష అనర్గళంగా మాట్లాడటంతో అతడిని బంగ్లాదేశీయుడిగా భావించిన ఉగ్రవాదులు చంపకుండా వదిలిపెట్టారు. తారుషిని మాత్రం విదేశీయురాలి కింద జమకట్టి చంపేశారు. మిగతా 19 మంది విదేశీ మృతుల్లో 9 మంది ఇటలీ పౌరులు, ఏడుగురు జపనీయులు, ఒక అమెరికన్ ఉన్నారు.  ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉంది. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులూ చనిపోగా,  మరో 30 మంది గాయపడ్డారు.

సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసిన తర్వాత రెస్టారెంట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. వారి వివరాలను ఖరారు కోసం శవపరీక్ష నిర్వహించారు. రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పది గంటల తర్వాత సైనిక చర్య...
శుక్రవారం రాత్రి  రెస్టారెంట్‌ను చుట్టుముట్టిన భద్రతాబలగాలు శనివారం ఉదయం వరకూ అంటే పది గంటల పాటు ఎటువంటి సైనిక చర్యా చేపట్టలేదు. ఉగ్రవాదులతో మాట్లాడేందుకు భద్రతాధికారులు ప్రయత్నాలు చేస్తుండగా.. అటువైపు నుంచి వారు అడపాదడపా కాల్పులు, బాంబులు విసురుతుండటంతో పోలీసు, భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

ఇద్దరు పోలీసు అధికారులు చనిపోవటంతో వెనక్కు తగ్గారు. శనివారం ఉదయం ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత భద్రతాధికారులు సైనిక చర్య మొదలుపెట్టారు. ‘ఆపరేషన్ థండర్‌బోల్ట్’ పేరుతో చేపట్టిన ఈ సైనిక చర్య ఉదయం 7:40 గంటలకు మొదలైంది. దాదాపు గంట సేపు రెస్టారెంట్ ప్రాంతం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లింది. స్నైపర్లు తుపాకులతో కాల్పులు జరపటం, సాయుధ సిబ్బంది వాహనాల (ఏపీసీల) నుంచి కాల్పులు జరపటం, గ్రెనేడ్లు పేల్చారు.

ఆ తర్వాత ఏపీసీల సాయంతో రెస్టారెంట్ గోడలు బద్దలు కొట్టి సైనిక సిబ్బంది లోపలికి ప్రవేశించారు. ఆర్మీ పారా కమాండో యూనిట్ ఈ ఆపరేషన్ నిర్వహించగా 13 నిమిషాల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం 13 మంది బందీలను విడిపించగా.. వారిలో ఒక భారతీయుడు, ఒక శ్రీలంక వాసి, జపాన్ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి చేసింది తమ వారేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ తమ తమాక్ వార్తా సంస్థ ద్వారా ప్రకటించింది. ‘ఐసిస్ కమాండోలు 24 మందిని చంపార’ని రక్తపు మడుగుల్లో పడివున్న పలు మృతదేహాల ఫొటోలను ఆ సంస్థ ఆన్‌లైన్‌లో ఉంచింది.
 
బంగ్లాలో భారీ ఉగ్రదాడి ఇదే తొలిసారి...
బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు తుపాకులు, బాంబులతో భారీ ఎత్తున దాడి చేసి, పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరించటం ఇదే తొలిసారి. ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్ ఇతర ముస్లిం దేశాలకు భిన్నంగా లౌకిక దేశంగా ప్రసిద్ధికెక్కింది. అయితే.. గత రెండేళ్లుగా ఈ దేశంలో హేతువాద కార్యకర్తలు, బ్లాగర్లు, మతపరమైన మైనారిటీలపై ముస్లిం ఛాందసవాదుల దాడులు, హత్యలు పెరుగుతూ వస్తున్నాయి. ఇస్లామిక్ మిలిటెంట్లు ఈ దురాగతాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో హిందూ పూజారిని, బౌద్ధ నాయకుడిని ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో నరికి చంపారు. మరో హిందువు ఇలాంటి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
 
ఉగ్రవాదులను సమూలంగా పెకలిస్తాం: హసీనా
సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు.‘ఇది అత్యంత హీనమైన చర్య. వీళ్లు ఎటువంటి ముస్లింలు? వారికి ఎటువంటి మతమూ లేదు. ఉగ్రవాదమే వారి మతం. వారు రంజాన్ తారబి ప్రార్థనల పిలుపును ఉల్లంఘించి ప్రజలను చంపారు. వాళ్లు ప్రజలను చంపిన విధానం సహించరానిది. వారిని తుదముట్టించి బందీలను విడిపించిగలిగినందుకు నేను అల్లాకు కృతజ్ఞతలు చెప్తున్నా. ఇస్లాం శాంతియుత మతం. ఇస్లాం పేరుతో ప్రజలను చంపటం ఆపండి.

దేశం నుంచి ఉగ్రవాదులను, హింసాత్మక తీవ్రవాదులను సమూలంగా పెకలించివేసేందుకు చేయాల్సిందంతా చేస్తాం’ అని  పేర్కొన్నారు. రెండు రోజులు అధికార సంతాప దినాలుగా ప్రకటించారు. పిడికెడు మంది ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు దేశప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. స్వార్థశక్తులు అమాయకలు బందీలుగా పట్టుకోవటం ద్వారా దేశాన్ని అరాచకదేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నాయని, స్థానిక శక్తులు అంతర్జాతీయ శక్తులతో కుట్రపన్నుతున్నాయని ధ్వజమెత్తారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించటం ద్వారా దేశాన్ని మళ్లీ శాంతియుత దేశంగాస్థాపించగలమన్నారు.
 
ఖురాన్ చెప్పలేదని హింస
బందీలుగా పట్టుకున్న వారి మతం ఏమిటనేది ఉగ్రవాదులు తనిఖీ చేశారని.. ఖురాన్ వాక్యాలు చెప్పాలని అడుగుతూ చెప్పలేని వారిని హింసించారని.. ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షి అయిన ఒక బంగ్లాదేశీ కుటుంబం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన హస్నత్ కరీమ్, ఆయన భార్య షార్మిన్ కరీమ్, కుమార్తెలు సాఫా (13), రాయాన్ (8)లు హోలీ ఆర్టిసన్ బేకరీలో సాఫా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుండగా ఉగ్రవాదులు దాడి చేశారు.

పది గంటల పాటు సాగిన ఉగ్రవాదుల పైశాచికత్వానికి వారు ప్రత్యక్ష సాక్షులయ్యారు. ‘‘వారు (ఉగ్రవాదులు) బంగ్లాదేశీ జాతీయులతో దురుసుగా ప్రవర్తించలేదు. పైగా బంగ్లాదేశీయులందరికీ వాళ్లు రాత్రి భోజనం కూడా ఏర్పాటుచేశారు. బందీలందరినీ ఖురాన్ వాక్యాలు చెప్పాలంటూ వారు అడిగారు. ఒకటో రెండో వాక్యాలు చెప్పగలిగిన వారిని ఏమీ అనకుండా వదలిపెట్టారు. మిగతా వారిని హింసించారు’’ అని హస్నత్ తండ్రి రేజుల్ కరీమ్ వివరించారు. సైనిక చర్యలో పలువురు ఇతర బందీలతో పాటు ఈ కుటుంబాన్ని కూడా విడిపించగా.. వారిని వెంటనే విచారణ నిమిత్తం డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలించారు.
 
బంగ్లా సోదరులకు అండగా ఉన్నాం: మోదీ
ఢాకా మారణహోమం తమకు మాటలకందని బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్విటర్‌లో తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శనివారం బంగ్లా ప్రధాని హసీనాకు ఫోన్ చేసి మాట్లాడానని, దాడిని తీవ్రంగా ఖండించానని తెలిపారు. ఈ విచార సమయంలో బంగ్లాదేశ్ సోదరసోదరీమణుల సరసన భారత్ దృఢంగా నిలుచుని ఉందన్నారు. భారతీయ యువతి తారుషి జైన్‌ని ఉగ్రవాదులు హత్యచేయటం తనను ఎంతో కలచివేసిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు.  

ఆమె తండ్రి సంజీవ్‌జైన్‌తో మాట్లాడానన్నారు.  ఢాకా మారణకాండను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. దుండగులపై ఉమ్మడిగా, నిర్ణయాత్మక చర్య చేపట్టాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు వెంట బీఎస్‌ఎఫ్ నిఘాను పటిష్టం చేసింది.

మరిన్ని వార్తలు