ప్రధాని మోదీపై ట్రంప్‌ వ్యంగ్యాస్త్రాలు

3 Jan, 2019 13:25 IST|Sakshi

వాషింగ్టన్‌ : అఫ్గనిస్తాన్‌లో లైబ్రరీకి నిధులు సమకూర్చడం కంటే నిరుపయోగమైన పని మరొకటి లేదని భారత ప్రధాని నరేంద్రమోదీతో తాను చెప్పానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. గురువారం జరుగుతున్న క్యాబినెట్‌ సమావేశంలో భాగంగా ఇతర దేశాలకు సహాయం చేయడం అనే అంశంపై ట్రంప్‌ చర్చించారు.  ఈ క్రమంలో గతంలో మోదీతో తాను సమావేశమైన సమయంలో మాట్లాడుకున్న విషయాల గురించి ప్రస్తావించారు.

ఏదో సాధించినట్లు మాట్లాడతారు..
‘ ఆ దేశానికి (అఫ్గనిస్తాన్‌) సహాయం చేసేందుకు రష్యా, భారత్‌, పాకిస్తాన్‌... నిజానికి మనం కూడా అక్కడ ఎందుకు పనిచేస్తున్నాం. వారికి సహాయం చేసేందుకే కదా. వాళ్లకు మనం 6 వేల మైళ్ల దూరంలో ఉన్నాం. అయినా ఫరవాలేదు. మన దేశ ప్రజలతో పాటు, ఇతర దేశాలకు కూడా సాయం చేయడం మన కర్తవ్యమే. అయితే అది ప్రాథామ్యం కాబోదు. ఇక కొంతమంది దేశాధినేతలైతే 100 నుంచి 200 మంది సైనికులను అక్కడికి పంపించి అక్కడేదో శాంతి సాధించినట్లుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంటుంది. ఓ మాట చెప్పనా... భారత ప్రధాని నరేం‍ద్ర మోదీ ఉన్నారు కదా. అఫ్గనిస్తాన్‌లో గ్రంథాలయాలకు నిధులు సమకూరుస్తామంటూ ఆయన నాకు పదే పదే చెప్పారు. అసలు అక్కడ లైబ్రరీని ఉపయోగించేవాళ్లు ఎవరైనా ఉంటారా. అది నిరుపయోగ చర్య. మనమేమో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చుపెడతాం. మరికొందరేమో చాలా చిన్న చిన్న సాయాలు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలని చూస్తారు. ఇంతవరకు ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందో లేదో కూడా స్పష్టంగా తెలీదు’ అంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాగా తాలిబన్ల దాడులతో హోరెత్తే అఫ్గనిస్తాన్‌కు..  చాలా ఏళ్లుగా భారత్‌ తన వంతు సాయం చేస్తోన్న విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్‌ పార్లమెంట్‌ భవన నిర్మాణానికి భారత ప్రభుత్వం 90 మిలియన్‌ డాలర్లు వెచ్చించింది. ఈ క్రమంలో 2015లో అఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు