ఉగ్ర అంతానికిది ఆరంభం

7 Jun, 2017 00:58 IST|Sakshi
ఉగ్ర అంతానికిది ఆరంభం

ఖతర్‌తో అరబ్‌ దేశాల కటీఫ్‌పై ట్రంప్‌
► తన పశ్చిమాసియా పర్యటన ఫలితమిస్తోందని వెల్లడి

వాషింగ్టన్‌/దోహా: ఖతర్‌తో అరబ్‌ దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకోవడం ఉగ్రవాద అంతానికి ఆరంభమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఇటీవల తను జరిపిన పర్యటన మంచి ఫలితాలిస్తోందని మంగళవారం ట్వీట్‌ చేశారు.

‘సౌదీ అరేబియా రాజుతోపాటు 50 దేశాల నేతల భేటీతో సాగిన నా సౌదీ పర్యటన ఇప్పటికే ఫలితాలిస్తోంది. ఉగ్రవాద సిద్ధాంతానికి ఇంకెంతమాత్రం నిధులు అందకూడదని వారికి చెప్పాను.. నేతలు ఇప్పుడు ఖతర్‌ను వేలెత్తి చూపుతున్నారు.. ఉగ్రవాదానికి నిధుల ప్రవాహంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.. ఉగ్రవాద బీభత్సం అంతానికి బహుశా ఇది ఆరంభం కావొచ్చు’ అని పేర్కొన్నారు.

ఖతర్‌ విమానాలకు ‘అరబ్‌’ దెబ్బ
ఖతర్‌తో అరబ్‌ దేశాల కటీఫ్‌ వెంటనే తీవ్ర ప్రభావం చూపింది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) తదితర దేశాలు ఖతర్‌కు మంగళవారం నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. ప్రతిగా ఖతర్‌ కూడా ఆ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో పర్షియన్‌ సింధుశాఖలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 70 విమానాలు నిలిచిపోయాయి.

ఖతర్‌ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత్‌ సహా పలు దేశాల ప్రజలు చిక్కుకుపోయారు. యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాలకు వెళ్లే విమానాలను ఖతర్‌.. ఇరాన్, టర్కీల మీదుగా దారి మళ్లించింది. ఆసియా–పసిఫిక్, యూరప్, అమెరికా ప్రాంతాల మధ్య సాగే పలు కీలక విమాన సర్వీసులకు దోహా మజిలీ కావడంతో సమస్య తీవ్రం కానుంది. విదేశాలకు వెళ్లే భారతీయుల్లో చాలామంది దోహా నుంచే వెళ్తుంటారు. 2016లో భారత్, ఖతర్‌ మధ్య 26 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఖతర్‌పై యూఏఈ ఆంక్షల నేపథ్యంలో ఖతర్‌ వెళ్లే భారత విమానాలు పాకిస్తాన్, ఇరాన్‌ మీదుగా దోహాకు వెళ్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం గంటకుపైగా పెరిగింది.

కువైట్‌ మధ్యవర్తిత్వం
ఖతర్‌ సంక్షోభ పరిష్కారానికి కువైట్‌ రంగంలోకి దిగింది. అరబ్‌ దేశాలకు, ఖతర్‌కు సయోధ్య కుదర్చడానికి కువైట్‌ అమీర్‌ (రాజు) షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌సబా మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డాకు పయనమయ్యారు. ఆయన వెంట విదేశాంగ, సమాచార మంత్రులున్నారు. సంయమనం పాటించాలని ఆయన ఖతర్‌ అమీర్‌ అల్‌ థానీని కోరారు. అల్‌ సబా విజ్ఞప్తిపై అల్‌ థానీ.. అల్‌ జజీరా టీవీ చానల్‌లో చేయాల్సిన ప్రసంగాన్ని వాయిదా వేసుకున్నారని ఖతర్‌ విదేశాంగ మంత్రి రెహమాన్‌ తెలిపారు. 2014లో అరబ్‌ దేశాలకు, ఖతర్‌కు దౌత్య సంబంధాలు చెడినప్పుడూ కువైట్‌ పాలకుడు మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ కుదిర్చారు.

మరిన్ని వార్తలు