ఫేస్‌బుక్‌కు ట్విటర్‌ స్ఫూర్తి కావాలి!

4 Nov, 2019 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ట్విటర్‌లో నవంబర్‌ 22వ తేదీ నుంచి రాజకీయ వాణిజ్య ప్రకటనలను నిషేధిస్తున్నామని, దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తామని ట్విటర్‌ సీఈవో జాక్‌ డోర్సే ఇటీవల ప్రకటించడం సముచిత నిర్ణయమని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్క్‌ జుకర్‌బర్గ్‌ సీఈవోగా ఉన్న ఫేస్‌బుక్‌లో రాజకీయ వాణిజ్య ప్రకటనల రూపంలో రాజకీయాలపై దుష్ప్రచారం, నకిలీ వార్తల చెలామణి అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మంచిదే. అయితే ఈ విషయంలో రాజకీయ దుష్ప్రచారాన్ని లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న రాజకీయ వాణిజ్య ప్రకటనల నిలిపివేతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అమెరికా పార్లమెంట్‌ ప్రశ్నకు జుకర్‌బర్గ్‌ సరైన సమాచారం ఇవ్వక పోవడం విచారకరం.

తప్పుడు రాజకీయ ప్రకటనలపై ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్య తీసుకుంటుందని అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు అలెగ్జాండ్రియా అకాసియో సూటిగా ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. కాంగ్రెస్‌ కమిటీ ముందు జుకర్‌బర్గ్‌ ప్రతినిధిగా ట్రెయిన్‌ రెక్‌ హాజరవుతారనగా ట్విటర్‌ సీఈవో తన నిర్ణయాన్ని ప్రకటించడం ప్రశంసనీయం. అయితే ఫేస్‌బుక్, గూగుల్‌ కంపెనీలతో పోలిస్తే ‘ట్విటర్‌’ చాలా చిన్న సంస్థ. అది తీసుకున్న నిర్ణయం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అదే ఫేస్‌బుక్, గూగుల్‌ అలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆశించిన ఫలితం ఉంటుంది. అది రాజకీయాల ప్రక్షాళనకు దారితీసే అవకాశం ఉంటుంది.

తప్పుడు, అసత్య వార్తల ప్రచారానికి సోషల్‌ మీడియా మాధ్యమం అవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతోంది. భిన్న జాతుల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొట్టడం ద్వారా తిరోగమన పార్టీలు లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య వార్తలను పేపర్‌ మీడియా అడ్డుకోవడం కష్ట సాధ్యమైన విషయం? (చదవండి: ట్విటర్‌ సంచలన నిర్ణయం)

>
మరిన్ని వార్తలు