వచ్చేవారంలోనే భారత్కు ఫేస్బుక్ అధినేత

4 Oct, 2014 18:55 IST|Sakshi
వచ్చేవారంలోనే భారత్కు ఫేస్బుక్ అధినేత

ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ వచ్చేవారమే భారతదేశానికి రాబోతున్నారు. ఆయన ఓ సదస్సులో పాల్గొనడానికి మాత్రమే వస్తున్నా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని చెబుతున్నారు. ఇంతకుముందు ఫేస్బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్బెర్గ్ జూలై నెలలో భారత్లో పర్యటించారు. సరిగ్గా మూడునెలల తర్వాత జుకెర్బెర్గ్ కూడా వస్తున్నారు. ప్రపంచంలోనే ఫేస్బుక్కు రెండో అతిపెద్ద మార్కెట్ భారతదేశం. ఇక్కడ భారీ సంఖ్యలో ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్కు యూజర్లున్నారు.

అమెరికా తర్వాత భారతదేశంలోనే ఫేస్బుక్ బాగా బలమైన ప్రభావం చూపుతోందని, ఇక్కడ దీన్ని విస్తరించడానికి ఇంకా బోలెడన్ని అవకాశాలున్నాయని సీఓఓ శాండ్బెర్గ్ ఇటీవల వచ్చినప్పుడు కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో అన్నారు. ప్రధానంగా విద్యారంగంలో ప్రభుత్వంతో కలిసి తాము పని చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు జుకెర్ బెర్గ్ కూడా ఇదే అంశం గురించి ప్రధానమంత్రితోను, ఇతర ఉన్నతాధికారులతోను చర్చించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు