అమెరికన్‌ ఎంబసీ సమీపంలో రాకెట్‌ దాడి

27 Jan, 2020 08:43 IST|Sakshi

బాగ్దాద్‌ : ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికన్‌ రాయబార కార్యాలయం సమీపంలో ఐదు రాకెట్లు పడిఉండటాన్ని గుర్తించారు. అమెరికా సహా పలు దేశాల రాయబార కార్యాలయాలున్న గ్రీన్‌జోన్‌లో వరుసగా రాకెట్‌ దాడులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఇరాక్‌ పార్లమెంట్‌ కూడా ఇదే ప్రాంతంలో ఉండటం గమనార్హం. బాగ్దాద్‌లోని అత్యంత భద్రత కలిగిన గ్రీన్‌జోన్‌ను ఐదు రాకెట్లు ఢీకొన్నాయని ఇరాక్‌ భద్రతా దళాలు పేర్కొన్నాయి. ఇరాక్‌ నుంచి అమెరికన్‌ దళాలు వైదొలగాలని ప్రముఖ మత గురువు మటాడా సదర్‌ పిలుపుతో బాగ్దాద్‌లో రెండు రోజుల కిందట భారీ ర్యాలీ జరిగిన నేపథ్యంలో రాకెట్‌ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. గత వారంలోనూ బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో మూడు రాకెట్లు అమెరికన్‌ ఎంబసీ సమీపంలో ఢీకొన్నాయి.  కాగా తాజా దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన సమాచారం వెల్లడికాలేదు.

చదవండి : అమెరికా లక్ష్యంగా.. ఇరాక్ స్థావరాలపై దాడులు

మరిన్ని వార్తలు