అసాధారణ చర్యలకూ వెనుకాడం!

12 Apr, 2017 07:07 IST|Sakshi
అసాధారణ చర్యలకూ వెనుకాడం!

జాధవ్‌కు పాక్‌ ఉరిశిక్ష విధించడంపై భారత్‌ స్పందన
► న్యాయం జరిగేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తాం
► పార్లమెంటులో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటన
► ఉభయసభల్లో సభ్యుల ఆందోళన
► 60 రోజుల్లో జాధవ్‌ అప్పీలు చేసుకోవచ్చు: పాక్‌ రక్షణ మంత్రి  


కుల్‌భూషణ్‌ జాధవ్‌కు పాక్‌ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అసాధారణ చర్యలకూ వెనుకాడబోమంది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ సభ్యులు లేవనెత్తారు.  జాధవ్‌కు న్యాయం జరిగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉభయసభల్లో సవివర ప్రకటన చేశారు. జాధవ్‌కు న్యాయం జరిగేందుకు దౌత్యపరంగానే కాకుండా.. అన్ని మార్గాల్లోనూ కృషి చేస్తామని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌:  భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాధవ్‌కు ఉరిశిక్షతో భారత్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోందని, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు కుయుక్తులకు పాల్పడుతోందని పార్లమెంట్‌లో ప్రభుత్వం విమర్శించింది.

ఉభయ సభల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ప్రకటన చేస్తూ ‘జాధవ్‌కు న్యాయం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం, అమాయకుడైన భారతీయుడ్ని పాక్‌ కిడ్నాప్‌ చేసింది. మరణశిక్షపై పాకిస్తాన్‌ ముందుకెళ్తే జాధవ్‌ ఉరిని పథకం ప్రకారం చేసిన హత్యగా పరిగణిస్తాం. అనంతరం ఇరుదేశాల దౌత్య సంబంధాలపై ఏర్పడే ప్రతికూల పరిణామాల గురించి పాకిస్తాన్‌ ఆలోచించుకోవాలి’ అని సుష్మా హెచ్చరించారు.

జాధవ్‌ను కలిసేందుకు అనుమతించలేదు
‘జాధవ్‌ తప్పుచేశాడనేందుకు ఎలాంటి ఆధారం లేదు.  జాధవ్‌పై ఆధారాల కోసం పాకిస్తాన్‌ భారత్‌ సాయాన్ని కోరింది. ఈ సందర్భంగా కేసుతో సంబంధం లేని కొందరు భారతీయ ఉన్నతాధికారులపై అర్థంలేని ఆరోపణలు చేసింది. తాము చూపించిన ఆధారాల్ని అంగీకరిస్తేనే జాధవ్‌ను కలిసేందుకు భారత్‌ రాయబార కార్యాలయాన్ని అనుమతిస్తామని పాకిస్తాన్‌ లింకు పెట్టింది.

నిజ నిర్ధారణకు, పాకిస్తాన్‌లో జాధవ్‌ ఉండడానికి గల కారణాల కోసం భారత్‌ రాయబార కార్యాలయాన్ని అనుమతించడం తప్పనిసరన్న అంశాన్ని మేం లేవనెత్తాం. తమ షరతులు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని మరోసారి పాక్‌ పేర్కొంది’ అని సుష్మా తెలిపారు. అంతకముందు లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ... జాధవ్‌కు న్యాయం జరిగేందుకు చేయదగ్గ అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.

మౌనం ఎందుకు?: లోక్‌సభలో కాంగ్రెస్‌
జాధవ్‌ విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ‘ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మీరు పెళ్లికి(నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె పెళ్లికి) హాజరుకావచ్చు. కానీ ఈ అంశంపై అతణ్ని(షరీఫ్‌) కలవడం, మాట్లాడడం గానీ చేయలేదు’ అని  మోదీని ఉద్దేశించి ఖర్గే పరోక్షంగా విమర్శించారు.   

రాజ్యసభలో ప్రతిపక్ష నేత  ఆజాద్‌ మాట్లాడుతూ..  జాధవ్‌ తరఫున ప్రభుత్వం అత్యుత్తమ న్యాయవాదిని ఏర్పాటు చేయాలన్నారు. సుష్మ స్పందిస్తూ.. పాకిస్తాన్‌ సుప్రీంకోర్టులోని అత్యుత్తమ న్యాయవాదుల్ని ఏర్పాటు చేయడంతో పాటు, పాక్‌ అధ్యక్షుడితో మాట్లాడతామని చెప్పారు. మరణశిక్షపై 60 రోజుల్లోపు కుల్‌భూషణ్‌ అప్పీలు చేసుకోవచ్చని పాక్‌రక్షణ మంత్రి అసిఫ్‌ చెప్పారు.

ముప్పును తిప్పికొట్టే సత్తా ఉంది
పాక్‌ ప్రధాని షరీఫ్‌
ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టే సత్తా తమ బలగాలకు ఉందని పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్‌ అన్నారు. ‘పాకిస్తాన్‌ శాంతికాముక దేశం. అన్ని దేశాలతో.. ముఖ్యంగా పొరుగు దేశాలతో స్నేహసంబంధాలను కోరుకుంటోంది. అయితే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మా బలగాలు సంసిద్ధంగా ఉన్నాయి’ అని చెప్పారు.

కుల్‌భూషణ్‌ జాధవ్‌ను ఉరితీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్‌ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత అనే భావన మారిపోయిందని, యుద్ధాలు ప్రస్తుతం సైన్యాలకు పరిమితం కాలేదని అన్నారు. మంగళవారం ఖైబర్‌–పంక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని అస్ఘర్‌ ఖాన్‌లో జరిగిన ఓ సైనిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఘర్షణలకు కాకుండా సహకారానికి, అనుమానానికి కాకుండా ఉమ్మడి శ్రేయస్సుకు తమ దేశం ప్రాధాన్యమిస్తుందన్నారు.

జాధవ్‌కు మరణశిక్షను వ్యతిరేకించిన బిలావల్‌..
జాధవ్‌కు మరణశిక్షను పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో పరోక్షంగా వ్యతిరేకించారు. ఇది వివాదాస్పద అంశమని, తమ పార్టీ మరణశిక్షకు వ్యతిరేకమని పేర్కొన్నారు.

 

>
మరిన్ని వార్తలు