కాలిపోనివ్వండి, కానీ న్యాయం జరగాలి

31 May, 2020 10:23 IST|Sakshi

న్యూయార్క్‌ : మిన్నియాపొలిస్‌కు చెందిన పోలీసు అధికారి చేతిలో హత్యకుగురైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ ‘జార్జ్‌ ఫ్లాయిడ్‌’కు న్యాయం జరగాలంటూ చేస్తున్న నిరసనలతో అమెరికా అట్టుడుకుతోంది. ఆగ్రహావేశాలకు లోనవుతున్న ఉద్యమకారులు హింసకు దిగుతున్నారు. వాహనాలను, షాపులను, రెస్టారెంట్లను తగులబెడుతూ చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మిన్నియాపొలిస్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌ సైతం వారి చేష్టలకు దగ్ధమైంది. బంగ్లాదేశ్‌నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ రూహెల్‌ హర్షద్‌ అనే వ్యక్తి ‘‘ గాంధీ మహాల్‌’’ పేరిట ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. గాంధీ మహాల్‌ కాలిపోయినా రూహెల్‌ మాత్రం బాధపడటం లేదు, ఉద్యమకారులపై కోపం తెచ్చుకోవటం లేదు. ‘‘ గాంధీ మహాల్‌ మంటల్లో కాలిపోయి ఉండొచ్చు.  కానీ, మా వర్గాన్ని రక్షించటం, వారి కోసం మద్దతుగా నిలవడం మాత్రం మానము’’  అంటూ గాంధీ మహాల్‌ యజమాని రూహెల్‌ కూతురు హఫ్సా అన్నారు. ( కర్ఫ్యూను ధిక్కరించి..)

నిరసనల్లో దగ్ధమైన ‘గాంధీ మహాల్‌’

ఈ మేరకు ఓ పోస్ట్‌ను ‘ గాంధీ మహాల్‌ రెస్టారెంట్‌’ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉంచారు. దీంతో పోస్టు కాస్తా వైరల్‌గా మారింది. తన తండ్రి రెస్టారెంట్‌ కాలిపోవటంతో బాధపడ్డా, ఉద్యమకారులకు అండగా నిలబడ్డారని ‘నా రెస్టారెంట్‌ కాలిపోనివ్వండి.. కానీ, బాధితుడికి న్యాయం జరిగి తీరాలి. ఆ పోలీసులను జైల్లో వేయాలి’ అని అన్నారు అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. తమ పొరుగు వారు సైతం రెస్టారెంట్‌ను కాపాడటానికి ఎంతో సహాయం చేశారని, వారి మేలు మర్చిపోమని, త్వరలో రెస్టారెంట్‌ను బాగు చేసుకుంటామని హఫ్సా తెలిపారు. అయితే తమ రెస్టారెంట్‌ నిరసనల్లో కాలిపోయినప్పటికి వారు నిరసనకారులకు మద్దతు తెలపటం, బాధితుడికి న్యాయం జరగాలని కోరుకోవటం నెటిజన్ల మనసును గెలుచుకుంది. (విడాకులకు దారి తీసిన జార్జ్‌ మృతి)

మరిన్ని వార్తలు