వారి గుండెల్లో వణుకు మొదలైంది: మలాల

5 Aug, 2018 09:32 IST|Sakshi
మలాల యూసఫ్‌జాయ్‌ (ఫైల్‌ ఫొటో)

బాలికా విద్య వారికి భయం పుట్టిస్తోందని వ్యాఖ్య

ఇస్లామాబాద్‌: బాలిక చేతిలో పుస్తకం మత చాందస వాదులకు వణుకు పుట్టిస్తోందని, అందుకనే పాఠశాలలు తగులబెడుతున్నారని నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్‌ జాయ్‌ (21) మండిపడ్డారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు గురువారం 12 స్కూళ్లను తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ధ్వంసమైన పాఠశాలలను తిరిగి పునరుద్ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. భయానికి వెరవకుండా దేశంలోని బాలబాలికలు బాగా చదువుకొని.. విద్య తమ హక్కు అని మత జాఢ్యంలో మునిగితేలుతున్న తీవ్రవాదులకు తెలియజెప్పాలని ఆకాక్షించారు. కాగా, ఉగ్రవాదుల చేతిలో దాడికి గురైన పాఠశాలల్లో ఎక్కువగా నిర్మాణ దశలో ఉన్నవేనని దియామిర్‌ డివిజన్‌ పోలీసు కమిషనర్‌ అబ్దుల్‌ వహీద్‌ షా తెలిపారు.

బాలికా విద్యకై ప్రాధాన్యమిస్తాం: ఇమ్రాన్‌ ఖాన్‌
పాకిస్తాన్‌ కాబోయే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ పాఠశాలల విధ్వంసంపై స్పందించారు. ‘విద్యాలయాలపై ఉగ్ర దాడిని ఖండిస్తున్నాను. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించబోను. త్వరలో కొలువుదీరే మా ప్రభుత్వం.. విద్యావ్యవస్థ పటిష్టానికి ప్రాధాన్యం ఇస్తుంది. ముఖ్యంగా బాలికా విద్యకై కృషి చేస్తాం’అన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. పాఠశాలల వద్ద గట్టి భద్రత కల్పిస్తామని అన్నారు.
 

మరిన్ని వార్తలు