మానవుడు వినని శబ్దాలతో కొత్త సంగీతం

20 May, 2017 20:02 IST|Sakshi
మానవుడు వినని శబ్దాలతో కొత్త సంగీతం

- వేలాది వాయిద్యాల సంగీతంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివద్ధి చేసిన గూగుల్‌
న్యూయార్క్‌: మానవుడు ఇంతవరకు ఎన్నడూ వినని శబ్దాలను గూగుల్‌ కృత్రిమ మేథస్సు పరిశోధనా బృందం ‘మెజెంటా’ సృష్టించింది. దీని కోసం వేలాది సంగీత వాయిద్యాలను ఉపయోగించి ఓ సాఫ్ట్‌వేర్‌నే అభివృద్ధి చేసింది. దీనికి ‘న్యూరల్‌ సింథసైజర్‌ లేదా ఎన్‌సింథ్‌’ అని పేరు కూడా పెట్టింది. అమెరికాలోని నార్త్‌ కరోలినాలో జరుగుతున్న సంగీత సాంకేతికోత్సవం ‘మూగ్‌ఫెస్ట్‌’లో దీన్ని ప్రదర్శిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ ఉత్సవం ఆదివారం రాత్రితో ముగుస్తుంది.

ప్రతి రెండు వేర్వేరు వాయిద్యాల మిశ్రమంతో వచ్చే శబ్దాలను రికార్డు చేస్తూ పోవడం ద్వారా కొత్త శబ్దాలను గూగుల్‌ బృందం సృష్టించింది. మనం జుగలబందీ సంగీత కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఇద్దరు విద్వాంసులు పోటీపడి వాయిస్తున్నప్పుడు వినిపించే రెండు వాయిద్యాల మిశ్రమంగా ఈ శబ్దాలు ఉండవు. ఎందుకంటే సంగీతానికి ఉండే మ్యాథమేటికల్‌ నోట్స్‌ ఆధారంగా ఈ మిశ్రమ శబ్దాలను సృష్టించారు. వీటిని హైబ్రీడ్‌ శబ్దాలుగా పరిగణించవచ్చు.

అయితే సంగీత విద్వాంసుల అవసరం లేకుండా చేయాలనే ఉద్దేశంతో తాము ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయలేదని, సంగీత విద్వాంసులకు ఈ శబ్ద సంగీత సాంకేతిక సాఫ్ట్‌వేర్‌ మరింత ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో, కొత్తవారు సులువుగా సంగీతాన్ని నేర్చుకునేందుకు దోహదపడాలనే లక్ష్యంతో ఈ కృత్రిమ సంగీతాన్ని సృష్టించామని మెజెంటా టీమ్‌ స్పష్టం చేసింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను సంగీత ప్రియులెవరైనా డౌన్‌లోడ్‌ చేసుకొని వారి ఇష్టానికి అనుగుణంగా మలుచుకోవచ్చని టీమ్‌ తెలిపింది.

గూగుల్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ప్రయోగం, గతంలో ఆర్కెస్ట్రాలు చేసిన ప్రయోగాలకు భిన్నమైనదేమీ కాదని, రెండు వాయిద్యాల నుంచి వచ్చే సంగీతాన్ని హృద్యంగా మిశ్రమం చేసిన సందర్భాలు కూడా ఇంతకుముందే ఉన్నాయని ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంగీత నిపుణులు, సంగీత విమర్శకులు మార్క్‌వైడెన్‌ బామ్‌ వ్యాఖ్యానించారు. గూగుల్‌ లాంటి సంస్థ కొత్త రకం శబ్దాలను సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తుంది కనుక, సంగీతం నేర్చుకోవాలనే వారికి అది కొత్త దారులు చూపించవచ్చని ఆయన అన్నారు. ఏదేమైనా ఇంకా పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి రాని ఈ సాఫ్ట్‌వేర్‌ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు