-

పాక్‌ తీరును ఎండగట్టిన గులాలయీ ఇస్మాయిల్‌

28 Sep, 2019 18:03 IST|Sakshi

న్యూయార్క్‌ : పాకిస్తాన్‌లో మైనార్టీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తమ ఆర్మీ ఇకనైనా ఆగడాలకు చరమగీతం పాడాలని పాక్‌ మహిళా హక్కుల కార్యకర్త గులాలయీ ఇస్మాయిల్‌ నినదించారు. అమాయక మైనార్టీలపై ఉగ్రవాదులుగా ముద్రవేసి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారంటూ ఆర్మీ దురాగాతాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో తనకు రక్షణ లేదని భావించిన గులాలయీ ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. తనకు రాజకీయంగా ఆశ్రయం కల్పించాలంటూ ఆమె అగ్రరాజ్యాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగిస్తున్న వేళ.. ఇస్మాయిల్ నేతృత్వంలో వందలాది మంది ఐరాస ఎదుట పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘పాకిస్తాన్‌కు బ్లాంక్‌ చెక్కులు నిలిపివేయాలి(నో మోర్‌ బ్లాంక్‌ చెక్స్‌ ఫర్‌ పాకిస్తాన్’, రాజకీయాల్లో పాక్‌ ఆర్మీ జోక్యం నిలిపివేయాలి(పాకిస్తాన్‌ ఆర్మీ స్టాప్‌ మెడ్లింగ్‌ ఇన్‌ పాలిటిక్స్‌) అనే నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా గులాలయీ మాట్లాడుతూ... ‘ఉగ్రవాదుల ఏరివేత పేరిట పాకిస్తాన్‌ అమాయకమైన పస్తూన్లు, బలూచీలు, సింధీలను హతమారుస్తోంది. అంతేకాదు మైనార్టీలపై ఉగ్రవాదులుగా ముద్రవేసి పాక్‌ సైన్యం వారిని అక్రమంగా బంధిస్తుంది. అక్కడ వారిపై హేయమైన దాడులకు పాల్పడుతోంది. పాక్‌ ఆర్మీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండాలన్నదే మా డిమాండ్‌. అలాగే టార్చర్‌ సెంటర్లలో ఉన్న మైనార్టీలను విడుదల చేయాలి. ఖైబర్‌ ఫంక్తువా ప్రావిన్స్‌లో తిష్ట వేసిన ఆర్మీ సైన్యం నియంత పోకడలతో.. తమని ప్రశ్నిస్తున్న వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ యథేచ్చగా దాడులకు తెగబడుతోంది’ అని మైనార్టీల పట్ల పాక్‌ సైన్యం ప్రవర్తిస్తున్న తీరును ఎండగట్టారు.

ఇక తన కుటుంబంపై బెంగగా ఉందన్న గులాలయీ... ‘పాక్‌ ఆర్మీ దురాగతాలను ఎత్తిచూపినందుకు నాపై వాళ్లు కక్షగట్టారు. వారికి వ్యతిరేకంగా గళమెత్తినందుకు అణచివేయాలని ప్రయత్నించారు. నా కుటుంబాన్ని బెదిరించి వారి దారిలోకి తెచ్చుకోవాలని చూశారు. అయితే ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. ఇది సహించలేని పాక్‌ అధికారులు మా నాన్న, సోదరుడిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు తరలించారు. కొంతమంది వ్యక్తుల సహాయంతో నేను మాత్రం తప్పించుకుని ప్రస్తుతం ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాను’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించారు.

కాగా పాక్‌ సైన్యం మైనార్టీ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా గులాలయీ వెలుగులోకి వచ్చారు. సంప్రదాయ పస్తూన్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆమెపై పాక్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశద్రోహానికి పాల్పడుతున్న గులాలయీని అదుపులోకి తీసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా పాక్‌ సైన్యం ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వారి పిటిషన్‌ను గులాలయీ సవాలు చేయడంతో ఆమెకు కోర్టులో ఊరట లభించింది. అనంతరం ఆమె అమెరికా చేరుకుని ప్రస్తుతం తన సోదరితో అక్కడే నివసిస్తున్నారు.

మరిన్ని వార్తలు