చరిత్ర సృష్టించిన హిల్లరీ

28 Jul, 2016 07:57 IST|Sakshi
చరిత్ర సృష్టించిన హిల్లరీ

అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు
- ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు
- నవంబర్ 8న ట్రంప్‌తో తలపడనున్న హిల్లరీ క్లింటన్
- విజయం సాధిస్తే దేశానికి తొలి మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం
 
 ఫిలడెల్ఫియా : హిల్లరీ క్లింటన్ చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కించుకున్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. మంగళవారం ఫిలడెల్ఫియాలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేశారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం హిల్లరీకి 4,764 మంది పార్టీ డెలిగేట్లు మద్దతు ప్రకటించారు. హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన ఏకగ్రీవ తీర్మానాన్ని.. ప్రైమరీల్లో ఆమెతో పోటీ పడిన బెర్నీ సాండర్స్ ప్రవేశపెట్టారు. 68 ఏళ్ల హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా, ప్రథమ మహిళగా, న్యూయార్క్ సెనెటర్‌గా గతంలో బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ.. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా, కమాండర్ ఇన్ చీఫ్‌గా హిల్లరీ రికార్డు సృష్టిస్తారు.

 డెమోక్రటిక్ సదస్సు రెండో రోజు తన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత.. హిల్లరీ న్యూయార్క్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఒక మహిళ అమెరికా అధ్యక్షురాలయ్యే మార్గంలో తొలి అడ్డంకిని అధిగమించామని హిల్లరీ పేర్కొన్నారు. ‘‘మీరు నాకు ఇచ్చిన అద్భుతమైన గౌరవమిది. ఈ విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. మీ అందరికీ కృతజ్ఞతలు. నా ఈ కలను నిజం చేసేందుకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది నిజంగా మీ విజయం. నా ప్రసంగం వినేందుకు ఎవరైనా బాలికలు నిద్రపోకుండా ఉంటే.. వారికి నేను చెప్పే మాట ఒక్కటే. నేను తొలి మహిళా అధ్యక్షురాలిని కావచ్చు.. కానీ ఆ తర్వాత మీలో ఒకరు అధ్యక్షురాలు అవుతారు’’ అంటూ ఉద్విగ్నంగా వేలాది మంది తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తున్నట్టుగా కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా వర్జీనియా సెనెటర్ టిమ్ కెయిన్‌ను హిల్లరీ గత వారం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే హిల్లరీ ఎంపికను నిరసిస్తూ పలువురు శాండర్స్ మద్దతుదారులు.. డెమోక్రటిక్ కన్వెన్షన్ జరుగుతున్న ప్రదేశం లోపలా.. బయటా నిరసనకు దిగారు.
 
 ఇదీ మా లవ్ స్టోరీ: బిల్ క్లింటన్
హిల్లరీ అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించడంపై ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్(69) హర్షం వ్యక్తం చేశారు. ‘1971 వసంతకాలంలో హిల్లరీని కలిశాను. పాలిటిక్స్, సివిల్ రైట్స్ క్లాస్‌లో తొలిసారి ఆమెను చూశాను. చూడగానే ఈమే నాకు సరైన జోడీ అనిపించింది. అందమైన ఒత్తై జుట్టు.. పెద్ద కళ్లద్దాలు.. మేకప్ లేదు.. ఆమె తెలివితేటలు, వ్యక్తిత్వం అమితంగా ఆకర్షించాయి. క్లాస్ పూర్తయిన తర్వాత ఆమెనే అనుసరిస్తూ వెళ్లా. అయితే పలకరించేందుకు ధైర్యం సరిపోలేదు. తర్వాత చాలా రోజులు ఆమె నాకు కనిపించినా మాట్లాడలేదు. ఓరోజు లా లైబ్రరీలో క్లాస్‌మేట్‌తో మాట్లాడుతున్నా.

ఇంతలో లైబ్రరీలో హిల్లరీ కనిపించింది. నన్నే చూస్తోంది. చదువుతున్న పుస్తకం మూసేసి నా దగ్గరకు వచ్చింది. ‘‘నువ్వు నన్ను చూస్తున్నావని తెలుసు. అందుకే నేనూ నిన్ను చూస్తున్నా. కనీసం మనం ఒకరి పేరు మరొకరు తెలుసుకోవాలి కదా. నా పేరు హిల్లరీ రోథమ్. నువ్వెవరు?’ అని ప్రశ్నించింది.  ఆశ్చర్యంతో  నాకు నోట మాట రాలేదు. చివరికి గొంతు పెగల్చుకుని పేరు చెప్పా. ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాం. తను వెళ్లిపోయింది. అప్పుడు లైబ్రరీ నుంచి ఒకే ఒక్క గోల్‌తో బయటకు వచ్చా’ అని డెమోక్రటిక్ డెలిగేట్ల కరతాళ ధ్వనులు, నవ్వుల మధ్య బిల్.. హిల్లరీతో తన ప్రేమ కథ తెలిపారు. 45 నిమిషాల తన ప్రసంగంలో వారిద్దరి మధ్యా జరిగిన సరదాలు, విశేషాలను చెప్పారు. ‘అన్ని అర్హతలు ఉన్న హిల్లరీనే అధ్యక్ష పదవికి అర్హురాలు. అమెరికాలో మార్పును తీసుకురాగలిగేది ఆమెనే. మనందరినీ ఏకంచేసే సత్తా ఆమెకుంది. ఆమె దీని కోసం తన జీవితాన్ని ధారబోసింది. ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలి’ అని  ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు