నదీతీరంలో మది పులకించే విందు

7 Sep, 2016 02:59 IST|Sakshi
గ్లెన్ వుడ్ విద్యుత్ భవంతి పొగ గొట్టాల మధ్య ఉక్కు తీగలతో వేలాడుతున్న గాజు అద్దాల రెస్టారెంట్ (నమూనా నిర్మాణం)

పాతనీ, కొత్తనీ కలిపి సరికొత్తగా సృష్టించడం ఇప్పటి ట్రెండ్. పాత నిర్మాణాలను అలాగే ఉంచేస్తారు, ఆ నిర్మాణాలకు ఏ మాత్రం భంగం కలగకుండా కొత్త నిర్మాణాలను వాటికి జోడిస్తారు. న్యూయార్క్‌లో ఇలాంటిదే ఒక సరికొత్త నిర్మాణం... రెస్టారెంట్‌గా కనువిందు చేయబోతోంది. పసందైన విందునీ ఇవ్వబోతోంది.
 
 గాల్లో తేలినట్టుందే... ఒళ్లు తూలినట్టుందే.. పాట గుర్తొస్తోందా? ప్రియురాలి కోసం హీరో పాడిన ఆ పాట సంగతేమోగానీ... ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దాల గదిలోకి వెళితే మాత్రం ఒళ్లు తూలినట్టు కావడం ఖాయం. ఎందుకంటే ఇది భూమికి 800 అడుగుల ఎత్తులో ఉంటుంది కాబట్టి. న్యూయార్క్ మహానగరంలో హడ్సన్ నది తీరంలో త్వరలో ఏర్పాటు కానున్న హైటెక్ రెస్టారెంట్ డిజైన్ ఇది. బిగ్‌ఫుట్ డెవలపర్స్ అనే సంస్థ దీన్ని నిర్మించనుంది.

పాతకాలపు గ్లెన్‌వుడ్ విద్యుత్ కేంద్రం భవనాన్ని అలాగే ఉంచి, దాని పొగ గొట్టాల మధ్యలో ఈ భారీ సైజు గాజు గదిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పొగగొట్టాల నుంచి ఉక్కు తీగల ద్వారా వేలాడే ఈ హోటల్ నాలుగు గోడలూ అద్దాలే. అంతేకాదు.. 44 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు ఉండే ఈ రెస్టారెంట్‌ను చేరుకోవాలంటే ఒక పొగ గొట్టం మధ్యభాగం నుంచి ఓ గాజు బ్రిడ్జిపై వెళ్లాల్సి ఉంటుంది.

ఇక రెస్టారెంట్ మధ్యభాగంలో పచ్చగా కనిపిస్తోందే.. అది ఈ హోటల్ తాలూకు వంటగది. ఉపరితలంపై పచ్చటి మొక్కలు ఏర్పాటు చేస్తారు అంతే. ఒకవైపు నది, ఇంకోవైపు ఆకాశహర్మ్యాల వెలుగులు ఉన్న ఈ రెస్టారెంట్‌లో ఒకసారికి దాదాపు 48 మంది కూర్చుని విందారగించవచ్చు. ఇది వినూత్నమైన అనుభూతి మిగులుస్తుందనడంలో సందేహం లేదుగానీ... నేలవైపున చూస్తే మాత్రం హార్ట్‌బీట్ పెరిగిపోవడం గ్యారంటీ!

మరిన్ని వార్తలు