చైనా చేష్టలకు భారత కౌంటర్‌ షురూ

17 Feb, 2018 11:18 IST|Sakshi
సుఖోయ్‌ యుద్ధ విమానం (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : చైనా కవ్వింపు చర్యలకు భారత సైన్యం కౌంటర్‌ యాక్షన్‌ మొదలుపెట్టేసింది. డెహ్రాడూన్‌(ఉత్తరాఖండ్‌)లోని జాలీ గ్రాంట్‌ ఎయిర్‌పోర్టును భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తమ ఆధీనంలోకి తీసేసుకుంది. ఇక్కడి నుంచి సుఖోయ్‌ యుద్ధ విమానాలతో గస్తీని నిర్వహణకు సిద్ధమైపోయింది. 

‘రెండు సుఖోయ్‌(సు-30 ఎంకేఐ) విమానాలు ఫిబ్రవరి 19వ తేదీ  ఉదయాన్నే బయలుదేరుతాయి. రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి 20వ తేదీ సాయంత్రం తిరిగి ఎయిర్‌ బేస్‌కు చేరుకుంటాయి. సినో(చైనా)-భారత్‌ సరిహద్దు వెంబడి ఇవి క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాయి. కొన్ని రోజులకు దీనిని దీర్ఘకాలికంగా కొనసాగిస్తాం’ అని ఐఏఎఫ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మాములు చర్యే అని ప్రకటించుకున్నప్పటికీ.. దీనివెనుక ముందు చూపు ఉన్నట్లు స్పష్టమౌతోంది.

రెండు దేశాల మధ్య దాదాపు 4000 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉంది. భవిష్యత్తులో చైనా సరిహద్దు(గగనతలం గుండా) ఉల్లంఘనకు పాల్పడితే అరుణాచల్‌ ప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్‌ ప్రాంతాలు లక్ష్యాలుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు గతంలో భారత సరిహద్దుల దాకా చైనా యుద్ధ విమానాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ క్షణాన అయినా దాడులు జరిగే అవకాశం ఉందని భారత్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ధాటిగా సమాధానం ఇచ్చేందుకే భారత సైన్యం ఈ ఎయిర్‌ బేస్‌ను నెలకొల్పినట్లు అధికారి ఒకరు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు