విడిచిపెడితే చైనా వినాశనమే

13 Jul, 2017 23:53 IST|Sakshi
విడిచిపెడితే వినాశనమే

చైనాయే లక్ష్యంగా క్షిపణిని అభివృద్ధి చేస్తున్న భారత్‌
అణ్వాయుధ సంపత్తి మెరుగుదిశగా ముందుకు
డ్రాగన్‌ ఆటకట్టించే రీతిలో తయారీ
200 వార్‌హెడ్లకు సరిపడా ప్లుటోనియం సిద్ధం
వెల్లడించిన వాషింగ్టన్‌ పత్రిక


వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: చీటికిమాటికి సరిహద్దుల వద్ద వివాదాలు సృష్టిస్తూ మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న చైనా ఆటకట్టించే దిశగా భారత్‌ ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. వాస్తవానికి ఇప్పటిదాకా పాకిస్థాన్‌నే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న  భారత్‌ ఇప్పుడు కమ్యూనిస్టు దిగ్గజం అంతుచూడాలని భావిస్తున్నట్టు అమెరికాకు చెందిన అణురంగ నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని తన స్థావరం నుంచి ప్రయోగిస్తే చైనా భస్మీపటలం అయ్యేస్థాయి కలిగిన క్షిపణిని భారత్‌ తయారుచేస్తోందని జూలై–ఆగస్టు మధ్యకాలంలో ప్రచురించిన ఓ వ్యాసంలో అమెరికాకు చెందిన డిజిటల్‌ జర్నల్‌ పేర్కొంది.

150 నుంచి దాదాపు 200 వార్‌హెడ్లకు సరిపడా ప్లుటోనియంను భారత్‌ సిద్ధం చేసిందని, అయితే 120 నుంచి 130 వార్‌హెడ్లను మాత్రమే తయారుచేస్తుందని సదరు వ్యాసం పేర్కొంది. సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్‌–చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరిస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత అణు శక్తిపై ప్రముఖ అమెరికన్‌ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది.

అమెరికాకు చెందిన హన్స్‌ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్‌ ఎస్‌ నోరిస్‌ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ 2017’ పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణు శక్తిని గురించి ప్రస్తావించారు. భారత్‌ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేసేంత క్షిపణులను తయారుచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్‌ వద్ద ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి. అందులో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయనుంది. ఇక అగ్ని–1ను ఆధునీకరించి అగ్ని–2ని తయారుచేసింది.

రెండు వేల కి.మీ  ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇక అగ్ని–4ను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేయవచ్చు. లాంగ్‌ రేంజ్‌ అగ్ని–5ని కూడా భారత్‌ అభివృద్ధి చేస్తోంది. ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని క్రిస్టెన్సన్, నోరీస్‌ తమ వ్యాసంలో పేర్కొన్నారు.

నేడు అఖిలపక్ష సమావేశం
చైనా వివాదంపై వివరణ ఇవ్వనున్న కేంద్రం

చైనాతో సరిహద్దు వివాదంతోపాటు కశ్మీర్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం కేంద్రం...అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పాల్గొనే అన్ని పార్టీల నాయకులకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. ఈ ప్రతిపక్ష నేతలతోపాటు ఇద్దరు సీనియర్‌ మంత్రులు కూడా హాజరవనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వివరించనున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల విషయంలో అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రావాలని కేంద్రం భావిస్తోంది.

కాగా ఇండియా–భూటాన్‌–టిబెట్‌ ట్రైజంక్షన్‌వద్ద సిక్కిం పరిధిలోగల డోక్లాంవద్ద యథాపూర్వకస్థితిని మార్చేందుకు చైనా యత్నిస్తుండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. గత మూడువారాలుగా డోక్లాం విషయమై ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు అమర్‌నాథ్‌ యాత్ర ముగించుకుని తిరిగివస్తున్న భక్తులపై జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు దాడులు జరపడం. ఏడుగురు యాత్రికులు చనిపోవడం తెలిసిందే. ఈ రెండు అంశాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు