అంతులేని అంతరం

20 Dec, 2018 05:43 IST|Sakshi

 స్త్రీ, పురుష అంతరాల్లో మన ర్యాంక్‌ 108

‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో మరింత క్షీణత

వెల్లడించిన జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు– 2018

ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుష అంతరాలకు అద్దంపట్టే ‘గ్లోబల్‌ ర్యాంకింగ్‌’లో భారత పరిస్థితి ఏ మాత్రం మారలేదు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) 149 దేశాలపై వెలువరించిన జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు, 2018 ప్రకారం భారత్‌ ర్యాంకు 108. గత సంవత్సరంలోనూ భారత్‌ ఇదే ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాలు, విద్య, ఆరోగ్యం– మనుగడ, రాజకీయ సాధికారత అంశాల (సబ్‌ ఇండెక్స్‌) ఆధారంగా డబ్ల్యూఈఎఫ్‌ఈ ర్యాంకులిచ్చింది.  

నివేదిక ప్రకారం భారత్‌ వేతన వ్యత్యాసాలను తగ్గించడంలో కొంత ప్రగతి సాధించింది. విద్యా రంగంలో 114వ స్థానంతో మెరుగైన పనితీరు కొనసాగించింది. స్త్రీలను ఆర్థికవ్యవహారాల్లో భాగస్వామిగా చేయడం, అవకాశాలు కల్పించడంలో వెనకబడింది. ఈ విభాగంలో భారత్‌ 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. రాజకీయ సాధికారత విషయంలో గత ఏడాది 15వ ర్యాంక్‌రాగా, ఈసారి 19కి పడిపోయింది. స్త్రీల ‘ఆరోగ్యం– మనుగడ’ సూచీలో అట్టడుగుకు చేరింది. గత సంవత్సరం 141 స్థానంలో వుండగా ఈ యేడాది 147 స్థానానికి దిగజారింది. ఆర్మీనియా (148), చైనా (149) చివరి రెండు స్థానాల్లో వున్నాయి. ఈ విభాగంలో ఒకటో స్థానానికి చేరిన దేశాల్లో శ్రీలంక కూడా వుండటం విశేషం.

ర్యాంకింగ్‌పరంగా తొలి 8 స్థానాల్లోని దేశాలు తమ దేశాల్లో 80 శాతం వరకు అసమానతలను రూపు మాపాయని నివేదిక తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే స్త్రీ పురుష అంతరాలను పూడ్చే దిశగా దక్షిణాసియాలో మెరుగైన కృషి జరిగిందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సగటు తీసుకుంటే రాజకీయ సాధికారత విషయంలో ఎక్కువ అంతరం (77.1శాతం)ఉంది. ఆర్థిక భాగస్వామ్యం– అవకాశాల విషయంలోనూ (41.9శాతం) అంతరం ఎక్కువగా వుంది. విద్య (4.4శాతం),ఆరోగ్యం– మనుగడ (4.6శాతం) అంశాల్లో వ్యత్యాసాలను బాగా తగ్గించగలిగారు. మార్పు ఇలా మందగమనంతో సాగితే స్త్రీ పురుషుల మధ్య అంతరాలను మొత్తంగా రూపు మాపాలంటే మరో 108 ఏళ్లు పడుతుందని నివేదిక పేర్కొంది.

48వ ర్యాంకు సాధించిన బంగ్లాదేశ్‌  
బంగ్లాదేశ్‌ దక్షిణాసియా విభాగంలో టాప్‌ ర్యాంకు (48) సాధించింది. రాజకీయ సాధికారత విషయంలో ముందడుగేసి బంగ్లాదేశ్‌ మెరుగైన ర్యాంక్‌ పొందింది. అంతర్జాతీయంగా 8వ ర్యాంకు సాధించిన ఫిలిప్పీన్స్‌.. ఆసియాలో ర్యాంకింగ్‌ పరంగా తొలి స్థానంలో వుంది. చైనా 100 నుంచి 103కి దిగజారింది. పాకిస్తాన్‌ చివరి నుంచి రెండో స్థానంలో వుండగా, యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌ చివరి స్థానంలో వుంది.

అగ్రస్థానాన ఐస్‌ల్యాండ్‌
ఐరోపాలోని ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్‌ వరసగా మొదటి మూడు ర్యాంకులు సాధించాయి. ఫిన్లాండ్, నికరాగువా, రువాండా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌ ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి. బ్రిటన్‌ 15, కెనడా 16, అమెరికా 51, ఆస్ట్రేలియా 53వ ర్యాంకులు సొంతం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు