ఆ మూడూ ప్రమాదకరం!

23 Jan, 2018 16:29 IST|Sakshi

ఉగ్రవాదం, వాతావరణ మార్పు, రక్షణాత్మక వ్యాపార ధోరణితో మానవాళికి పెనుముప్పు

వాతావరణ మార్పులపై ధనిక దేశాలది కపట ధోరణి  

పెట్టుబడులకు సంబంధించి రెడ్‌టేప్‌ స్థానంలో.. రెడ్‌ కార్పెట్‌ తీసుకొచ్చాం!

ప్రస్తుత ప్రపంచానికి భారతీయ తత్త్వమైన ‘వసుధైక కుటుంబం’ ఉత్తమం

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సదస్సులో మోదీ కీలక ప్రారంభోపన్యాసం

దావోస్‌ : ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, రక్షణాత్మక వ్యాపార ధోరణులు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద ముప్పులుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ కొందరు చేస్తోన్న తప్పుడు విభజన కూడా ఉగ్రవాదంతో సమానమేనని ఆయన హెచ్చరించారు.

వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలవి కేవలం మాటలేనని, అవి చిన్న దేశాలకు సాయపడడం లేదని విమర్శించారు. కొన్ని దేశాలు రక్షణాత్మక వ్యాపార ధోరణి అవలంబించడం ప్రమాదకరమన్న ప్రధాని.. ప్రపంచీకరణ ప్రాభవం రోజురోజుకూ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్‌లో మాత్రం రెడ్‌టేప్‌(పరిశ్రమలకు అనుమతులివ్వడంలో అలవికాని జాప్యం) స్థానంలో రెడ్‌ కార్పెట్‌  తీసుకువచ్చామన్నారు.

స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో నిర్వహిస్తోన్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సులో మోదీ మంగళవారం కీలక ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్‌ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు.  


మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
వాతావరణ మార్పులపై...: మన సంస్కృతిలో ప్రకృతిని మనం తల్లిగా భావిస్తాం. పారిస్‌ ఒప్పందం మేరకు మన అభివృద్ధి ప్రక్రియ పర్యావరణ పరిరక్షణకు లోబడి ఉంటుందని మనం హామీనిచ్చాం. వాతావరణ మార్పుల విషయంలో మన బాధ్యతల్ని గుర్తెరగడమే కాకుండా.. ఆ దుష్పరిణామాల్ని అడ్డుకునేందుకు ముందడుగు వేయాలి. తీవ్రమైన వాతావరణ మార్పులతో మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని ద్వీపాలు మునిగిపోతుండగా.. కొన్ని మునిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏం చేయాలో ప్రపంచం ఆలోచించాలి. పర్యావరణం పట్ల శ్రద్ధ భారతదేశ సంస్కృతిలో భాగం. దేనినైనా తన దురాశ కోసం వాడుకోవడానికి మహాత్మా గాంధీ వ్యతిరేకం. వాతావరణం విషయంలో చిన్న దేశాలకు సాయం చేసేందుకు ఎన్ని అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా ఉన్నాయనేది కూడా ప్రశ్నే. కర్బన ఉద్గారాల్ని తగ్గించాలని ప్రతి ఒక్కరూ మాటలు చెపుతున్నారు. కొత్త సాంకేతికత సాయంతో చిన్న దేశాలకు సాయం చేసేందుకు మాత్రం ధనిక దేశాలు సిద్ధంగా లేవు.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేద్దాం..
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమని నేను గట్టిగా చెప్పగలను. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ కొందరు చేస్తోన్న తప్పుడు విభజన కూడా ఉగ్రవాదంతో సమానమే. మనమందరం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలి. ఉగ్రవాదంపై పోరాడే శక్తులకు భారత్‌ అండగా ఉంటుంది.  

రిఫామ్‌.. పెర్‌ఫామ్‌.. ట్రాన్స్‌ఫామ్‌!
సంస్కరణలు (రిఫామ్‌), ఉత్తమ ప్రదర్శన (పెర్‌ఫామ్‌), సానుకూల మార్పే(ట్రాన్స్‌ఫామ్‌) మా మంత్రం.. మా మార్గం. పెట్టుబడులకు మా ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరిచింది. అనుమతుల్లో అలసత్వాన్ని తొలగించాం. విప్లవాత్మక నిర్ణయాలు, అభివృద్ధి కేంద్రంగా సాగే విధానాల్ని మా ప్రభుత్వం ఎంచుకుంది. భారత్‌లో పెట్టుబడుల అనుమతులు, ఉత్పత్తి విధానాల్ని చాలా సులభతరం చేశాం. లైసెన్స్, పర్మిట్‌ రాజ్‌ను తొలగించాలని నిర్ణయించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కొద్దీ సంస్కరణల్ని చేపడుతున్నాయి. దేశ పురోగతికి అడ్డుగా ఉన్న 1400 పాత చట్టాల్ని తొలగించాం.

సంఘటిత, ఐక్యతా విలువల పట్ల బలమైన నమ్మకముంది
డబ్ల్యూఈఎఫ్‌ నినాదం ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’. ప్రస్తుతం ప్రపంచంలోని చీలికలు, విభేదాల పరిష్కారానికి భారతదేశ తత్వమైన వసుధైక కుటుంబం(ప్రపంచమంతా ఒకే కుటుంబం) చక్కగా సరిపోతుంది.

భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతి కోసం పాటుపడింది. సంఘటితం, ఐక్యతా విలువల పట్ల భారత్‌కు నమ్మకముంది. మన సమాజంలోని కొన్ని విధ్వంసక శక్తులకు అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వాల్ని అడ్డుకునే సామర్థ్యముంది. మనం సంఘటితంగా నిలిస్తే.. ఆ శక్తుల వల్ల వేరుపడ్డ సమాజాన్ని ఏకం చేయవచ్చు. భారత్‌లోని ప్రజాస్వామ్య విధానం  కేవలం ఒక రాజకీయ వ్యవస్థ కాదు. అది జీవన విధానం. భారతదేశంలోని ప్రజాస్వామ్యం, భిన్నత్వాల్ని చూసి మేం గర్విస్తున్నాం. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, వస్త్రధారణలు, వంటలు మా సొంతం.  

అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం
1997లో అప్పటి భారత ప్రధాని దేవెగౌడ దావోస్‌కు వచ్చిన సమయంలో భారత జీడీపీ 400 బిలియన్‌ డాలర్లు (రూ.26 లక్షల కోట్లు). అయితే ఇప్పుడు అది ఆరు రెట్లు పెరిగింది.  2025 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్లకు(రూ.318 లక్షల కోట్లు) చేరనుంది. అందరికీ అభివృద్ధి ఫలాలు అందే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తున్నాం.

30 ఏళ్ల అనంతరం 2014లో భారతీయులు ఒక పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా అందరి అభివృద్ధి కోసం పాటుపడాలని మేం తీర్మానించుకున్నాం. మా నినాదం ‘సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌’. పథకం ఏదైనా అందరికీ అభివృద్ధి చేరడమే లక్ష్యం.  

ప్రస్తుతం సమాచార సాంకేతికతదే పై చేయి  
1997 నుంచి ఈ 20 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయింది. అప్పటి సదస్సులో ‘అనుసంధాన సమాజ నిర్మాణం’ డబ్ల్యూఈఎఫ్‌ నినాదం. ఇప్పుడు ప్రపంచం సమాచార కేంద్రంగా మారిపోయింది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. నాడు  అమెజాన్‌ అంటే దట్టమైన అడవులనే అందరికీ తెలుసు. అప్పుడు పక్షులు మాత్రమే ట్వీటింగ్‌ (కిచకిచలు) చేసేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి.

ప్రస్తుత యుగంలో సమాచారమే నిజమైన సంపద. ఎవరికైతే దానిపై అదుపు ఉంటుందో భవిష్యత్తులో వారే ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఈ సమాచార వెల్లువ.. భారీ అవకాశాలే కాకుండా సవాళ్లను కూడా సృష్టిస్తోంది. సాంకేతికత ఆధారంగా చోటుచేసుకున్న మార్పులు ప్రజల ఆలోచనలు, పనితీరుతో పాటు అంతర్జాతీయ విభాగాలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.


ధనిక దేశాల రక్షణాత్మక ధోరణి
చాలా దేశాలు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత  సాంకేతిక అనుసంధాన ప్రపంచంలో ప్రపంచీకరణ ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రపంచీకరణ నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు.. దానిని నీరుగార్చాలన్నది కొన్ని ధనిక దేశాల ఆకాంక్ష.  ఉగ్రవాదం, వాతావరణ మార్పుల కంటే ఈ విధమైన రక్షణాత్మక ధోరణిని తక్కువ ప్రమాదకరంగా భావించలేం.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ప్రజల ఆకాంక్షల్ని, కలల్ని ప్రతిబింబిస్తున్నాయా? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. ‘నా ఇంటి తలుపులు, కిటికీలు మూసుకోవాలని నేను కోరుకోను. అన్ని దేశాల సంస్కృతులతో కూడిన పవనాలు నా ఇంట్లోకి రావా లని కోరుకుంటా. అదే సమయంలో అవి నా సంస్కృతిని పెకిలించేందుకు అనుమతించను’ అని జాతిపిత చెప్పారు.   


కెనడా ప్రధానితో మోదీ చర్చలు
వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్యూతో మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై వీరి మధ్య చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్విటర్‌లో వెల్లడించింది.

నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో కూడా ఆయన భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు అనంతరం ప్రధాని మోదీ మంగళవారం రాత్రి భారత్‌కు బయల్దేరారు. మరోవైపు ప్రధాని ఫిబ్రవరి రెండో వారంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఒమన్, పాలస్తీనా దేశాల్లో పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు