భార్యను రేప్ చేస్తే శిక్షించాల్సిందే!

17 Mar, 2016 14:45 IST|Sakshi
భార్యను రేప్ చేస్తే శిక్షించాల్సిందే!

న్యూయార్క్: భార్యకు ఇష్టం లేకుండా ఆమెతో సెక్స్‌లో పాల్గొంటే దాన్ని రేప్ కిందనే పరిగణించాలని, అందుకు సరైన శిక్ష విధించాల్సిందేనని ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చీఫ్ హెలెన్ క్లార్క్ భారత్‌ను కోరారు. ఎవరి విషయంలో జరిగినా రేప్,అది అత్యాచారమేనని, అది బయటి వాళ్ల విషయంలో జరిగినా, భార్య విషయంలో జరిగినా రేప్‌గానే పరిగణించాలని వాదించారు. భార్యపై శారీరక హింసకు పాల్పడినప్పుడు అది కుటుంబ వ్యవహారం అంటూ కొట్టివేయడం లేదు కనుక, సమ్మతిలేని సెక్స్ కూడా అత్యాచారమేనని ఆమె అన్నారు. దీన్ని శిక్షార్హం చేస్తూ చట్టం తీసుకరావాలని ఆమె భారత్‌కు సూచించింది.

 భారత్‌లోని నిరక్షరాస్యత, విద్యాస్థాయి, దారిద్య్రం, సామాజిక ఆచారాలు, విలువలు, మత విశ్వాసాలు, సమాజం మైండ్‌సెట్ కారణంగా దేశంలో మారిటల్ రేప్‌లను శిక్షించేందుకు చట్టాలు తీసుకరావడం కుదరదని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఇటీవల పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన నేపథ్యంలో హెలెన్ క్లార్క్ భారత్ ముందుకు ఈ వాదన తీసుకొచ్చారు.

మహిళలపై శారీరకంగా జరిగే హింసను గృహహింస కింద గుర్తిస్తున్నప్పుడు పరస్పర సమ్మతి లేకుండా జరిగే సెక్స్‌ను ఎందుకు రేప్‌గా గుర్తించరని క్లార్క్ అన్నారు. బాలికలు, మహిళల సాధికారతను సాధించడం మనముందున్న ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. 15 ఏళ్ల పైబడిన భార్యతో ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటే భారత చట్టాల ప్రకారం రేప్‌కాదు. అదే సమయంలో 18 ఏళ్ల లోపు అమ్మాయిలతో సమ్మతితోనైనా సెక్స్‌లో పాల్గొంటే అక్రమం అంటారు. దానికి శిక్షలు లేవు.

 

భార్య అనుమతి లేకుండా సెక్స్‌లో పాల్గొంటే రేప్‌గా పరిగణించాలంటూ కొన్ని మహిళా సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ల కూడా దాఖలు చేశాయి. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తన వైఖరిని మార్చుకోలేదు.  రేప్ విషయంలో మేనకా గాంధీవ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏకీభవిస్తారా లేదా అన్న అంశంపై ట్విట్టర్ ఓ సర్వే నిర్వహించగా, 52 శాతం మంది మేనకా గాంధీ వాదనతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు